Narendra Modi: టార్గెట్ సౌత్ ఇండియా.. ఈరోజు ఏకంగా మూడు రాష్ట్రాల్లో మోదీ సుడిగాలి ప్రచారం

PM modi election campaigns in 3 states today

  • నేడు కేరళ, తమిళనాడు, తెలంగాణల్లో మోదీ ప్రచారం
  • కేరళలోని పతనంతిట్ట, తమిళనాడులోని కన్నియాకుమారిలో బహిరంగ సభలు
  • హైదరాబాద్ మల్కాజ్ గిరిలో రోడ్ షో

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి పెరుగుతోంది. అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేస్తున్నారు. పలు సర్వేల రిపోర్టులో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందని వెల్లడిస్తున్నాయి. ఉత్తరాదిలో బీజేపీ ప్రభంజనం ఉంటుందని చెపుతున్నాయి. 

ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దక్షిణాదిన వీలైనన్ని సీట్లను గెలిచి క్రమంగా బలాన్ని పెంచుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ దక్షిణాదిన ప్రచారాన్ని మోతెక్కించబోతున్నారు. ఈరోజు ఏకంగా మూడు రాష్ట్రాల్లో (కేరళ, తమిళనాడు, తెలంగాణ) ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 

ఉదయం 10.30 గంటలకు మోదీ కేరళలోని పతనంతిట్టకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు కేరళ బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్, కేరళ బీజేపీ ఇన్ఛార్జీ ప్రకాశ్ జవదేకర్ తదితరులు స్వాగతం పలుకుతారు. అక్కడ జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కేరళ నుంచి ఎన్డీయే తరపున పోటీ చేయబోయే పలువురు అభ్యర్థులు ఈ సభకు హాజరవుతారు. కేరళలో సభ ముగిసిన వెంటనే ఆయన తమిళనాడుకు బయల్దేరుతారు. 

తమిళనాడులోని కన్నియాకుమారిలో నిర్వహించే బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ ఏడాది మోదీ తమిళనాడులో పర్యటించడం ఇది ఐదోసారి. ఈసారి తన ప్రధాన భాగస్వామి అన్నాడీఎంకేతో పొత్తు లేకుండానే బీజేపీ బరిలోకి దిగుతోంది. కన్నియాకుమారి సభలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయధరణి బీజేపీలో చేరుతున్నారు. సభ ముగిసిన వెంటనే మోదీ హైదరాబాద్ కు బయల్దేరుతారు. 

హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టులో మోదీ ల్యాండ్ అవుతారు. అనంతరం మల్కాజ్ గిరిలో రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొనబోతున్నారు. ఈ రాత్రికి ప్రధాని రాజ్ భవన్ లో బస చేస్తారు.

  • Loading...

More Telugu News