Etela Rajender: బీజేపీయే మెజార్టీ సీట్లు గెలుస్తుంది... హుజూరాబాద్‌లో నమ్మినవాళ్లే మోసం చేశారు: ఈటల రాజేందర్

Etala Rajender election campaign in Malkajgiri

  • దేశాన్ని అన్ని రంగాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్న ఈటల
  • ప్రపంచ దేశాలన్నీ మన ప్రధానికి రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయని వ్యాఖ్య
  • కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్న ఈటల రాజేందర్
  • కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రికి అప్పుడే కళ్లు నెత్తికెక్కాయని విమర్శ

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం మహావీర్ హరిత వనస్థలి పార్కులో మార్నింగ్ వాకర్స్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో ఓటర్లను కలుస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశాన్ని అన్ని రంగాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రపంచ దేశాలన్నీ మన ప్రధానికి రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని వారిని కోరారు.

కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే రావాలని దేశమంతా కోరుకుంటోందన్నారు. రాష్ట్రంలోనూ మెజారిటీ సీట్లు బీజేపీయే గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న మన దేశాన్ని మోదీ ప్రభుత్వం అయిదో స్థానానికి తీసుకువచ్చిందని... ఇప్పుడు మూడో స్థానానికి తీసుకు వచ్చేందుకు పని చేస్తోందన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తీవ్రవాదుల దాడులు తగ్గాయన్నారు. పుల్వామా దాడి చేసిన వారిని సర్జికల్ స్ట్రైక్ చేసి హెచ్చరించారని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చారని గుర్తు చేశారు. 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం కల సాకారమైందన్నారు. 

విజ్ఞతతో... ఆలోచించి ఓటు వేయాలని ఈటల రాజేందర్ కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. 2019 కంటే ఈసారి వారికి మరిన్ని సీట్లు తగ్గుతాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేశానని.. కానీ నమ్మినవారు తనను ఆగం పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రికి అప్పుడే కళ్లు నెత్తికెక్కాయని విమర్శించారు. అధికారం ఉందని ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఈటల రాజేందర్‌తో మేకల కావ్య భేటీ

జవహర్ నగర్ మున్సిపల్ చైర్మన్ మేకల కావ్య, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డిలతో ఈటల రాజేందర్ గురువారం సమావేశమయ్యారు.

More Telugu News