MRO Rajini: జమ్మికుంట తహసీల్దార్ రజనీ అక్రమాస్తులు రూ. 12 కోట్ల పైనే!
- నిన్న రజని, ఆమె సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ సోదాలు
- రెండంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు, కిలోన్నర బంగారం సహా మరెన్నో గుర్తింపు
- అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఏసీబీ
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అవినీతి అధికారుల భరతం పడుతోంది. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఇటీవల దాడిచేసిన అవినీతి నిరోధకశాఖ వందల కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది. తనిఖీల్లో ఆయన ఇంట్లో గుట్టలకొద్దీ కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు లభించాయి. తాజాగా, నిన్న జమ్మికుంట తహసీల్దార్ రజని, ఆమె సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో జరిపిన దాడిలో కళ్లు చెదిరే ఆస్తులను గుర్తించారు. ఆమె అక్రమాస్తుల విలువను రూ. 3 కోట్లుగా గుర్తించగా, బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ. 12 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు.
హనుమకొండలోని కేఎల్ఎన్‌రెడ్డి కాలనీలో ఉంటున్న రజని ఏడు నెలల క్రితం వరకు ధర్మసాగర్ తహసీల్దార్‌గా పనిచేశారు. ఎన్నికల సమయంలో జమ్మికుంట బదిలీ అయ్యారు. ఆమె అక్రమాలపై ఫిర్యాదులు అందుకున్న ఏసీబీ నిన్న ఆమె ఇంటితోపాటు సన్నిహితులైన మరో ఐదుగురి ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరిపారు.
ఈ తనిఖీల్లో రెండంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు, ఏడెకరాల వ్యవసాయభూమి, రెండుకార్లు, మూడు బైక్‌లు, లక్షన్నర రూపాయల నగదు, బ్యాంకులో రూ. 25 లక్షలు, కిలోన్నర బంగారు ఆభరణాలను గుర్తించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రజని బదిలీ చేయించిన ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఓ ప్రజాప్రతినిధి ఫిర్యాదుతోనే ఏసీబీ రంగంలోకి దిగినట్టు తెలిసింది.