Chandrababu: దూకుడు పెంచిన బీజేపీ.. చంద్రబాబుతో భేటీ కానున్న కేంద్ర మంత్రి
- చంద్రబాబుతో భేటీ కానున్న గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కల్యాణ్
- ఎన్నికల కార్యాచరణపై చర్చించనున్న నేతలు
- కాసేపటి క్రితం విజయవాడకు చేరుకున్న చంద్రబాబు
టీడీపీ, జనసేనలతో పొత్తు కుదిరిన తర్వాత ఏపీలో బీజేపీ దూకుడు పెంచుతోంది. అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును కాసేపట్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కలవనున్నారు. అమరావతిలోని చంద్రబాబు నివాసానికి షెకావత్ వెళ్లనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ ఎంపీ పండా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఎన్నికల కార్యాచరణపై వీరు చర్చించబోతున్నారు.
11 గంటలకు వీరి భేటీ ప్రారంభం కాబోతోంది. సమావేశం ముగిసిన అనంతరం షెకావత్ నేరుగా ఢిల్లీకి బయల్దేరుతారు. మరోవైపు నిన్న రాత్రి షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై వీరిద్దరూ చర్చించారు. బీజేపీ, జనసేనలకు టీడీపీ 8 ఎంపీ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. వీటిలో 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని సమాచారం. మరోవైపు, కాసేపటి క్రితం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి బయల్దేరారు.