MLA Venkata Ramana Reddy: 2028లో నేనే ముఖ్యమంత్రిని అవుతా: బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి
- కామారెడ్డిలో రేవంత్, కేసీఆర్ లను ఓడించిన రమణా రెడ్డి
- 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా
- బీజేపీ ప్రభుత్వం ఏర్పడకపోతే తన ముఖం చూపించనని వ్యాఖ్య
తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డిది ఒక చరిత్ర అనే చెప్పుకోవచ్చు. ఒకే ఎన్నికలో ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన ఘనత ఆయనది. అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిలను ఓడించి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇలాంటి ఘనతను సాధించిన నాయకుడు మన దేశ చరిత్రలో మరెవరూ ఉండకపోవచ్చేమో. తాజాగా ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కామారెడ్డిలో కొన్నాళ్లుగా ప్రొటోకాల్ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఉన్నత హోదా ఇస్తున్నారని, శిలాఫలకాలపై కూడా ఆయన పేరును చేరుస్తున్నారని రమణా రెడ్డి మండిపడ్డారు. 2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అప్పుడు తానే సీఎం అవుతానని, తన గర్ల్ ఫ్రెండ్ కు మంత్రి పదవిని ఇస్తానని తెలిపారు. గర్ల్ ఫ్రెండ్ కి మంత్రి పదవి ఇవ్వొచ్చు అనుకుంటే... తాను కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ని తయారు చేసుకుంటానని చెప్పారు.
2023లో తాను ఎమ్మెల్యే అవుతానని చెప్పానని... అలాగే ఎమ్మెల్యే అయ్యానని రమణా రెడ్డి తెలిపారు. 2028లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, తానే సీఎం అవుతానని... బీజేపీ ప్రభుత్వం రాకపోతే తన ముఖం కూడా చూపించనని అన్నారు. ఇది తన ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పారు.