Jason Roy: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్

Jason Roy pulls out of IPL 2024 with personel reasons

  • వ్యక్తిగత కారణాలతో వైదొలగిన స్టార్ బ్యాట్స్‌మెన్ జాసన్ రాయ్
  • రాయ్ స్థానంలో ఫిల్ సాల్ట్‌ను తీసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం
  • రిజర్వ్ ధర రూ.1.5 కోట్లు దక్కించుకుందని వెల్లడించిన ఐపీఎల్ పాలకమండలి

ఐపీఎల్ 2024 ఎడిషన్ ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాలతో టోర్నమెంట్ 17వ ఎడిషన్‌ నుంచి వైదొలిగాడు. కాగా గతేడాది సీజన్‌ నుంచి కోల్‌కతాకు జాసన్ రాయ్ ఆడుతున్నాడు. నిరుడు ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు. కాగా జాసన్ రాయ్ స్థానంలో ఇంగ్లండ్‌కే చెందిన మరో స్టార్ ఆటగాడు ఫిల్ సాల్ట్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం ఎంపిక చేసుకుంది. ఈ మేరకు ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ వ్యక్తిగత కారణాలతో రాబోయే టాటా ఐపీఎల్ 2024 నుంచి జాసన్ రాయ్ వైదొలిగాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రాయ్ స్థానాన్ని ఫిల్ సాల్ట్‌తో భర్తీ చేసింది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన తర్వాత వేలంలో అతడు అమ్ముడుపోలేదు. సాల్ట్‌కు ఈ ఏడాది రెండవ సీజన్ ఐపీఎల్ కానుంది’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. 

‘‘ఇంగ్లండ్‌కు చెందిన దూకుడైన వికెట్-కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ రిజర్వ్ ధర రూ.1.5 కోట్లతో కొనుగోలు చేసింది. సాల్ట్ గతేడాది డిసెంబర్‌లో వెస్టిండీస్‌పై వరుసగా రెండు టీ20 సెంచరీలు బాదాడు. ట్రినిడాడ్‌లో 4వ టీ20 మ్యాచ్‌లో 48 బంతుల్లోనే వేగంగా శతకాన్ని బాదాడు’’ అని ఐపీఎల్ పాలకమండలి పేర్కొంది. కాగా 2023 సీజన్‌లో ఫిల్ సాల్ట్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడాడు. 2 అర్ధ సెంచరీలు మినహా పెద్దగా రాణించలేదు. దీంతో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకుంది. ఐపీఎల్ వేలంలో కూడా సెలక్ట్ కాకపోవడంపై సాల్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తాను ఎంపిక కాకపోవడం గందరగోళంగా అనిపిస్తోందని చెప్పిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News