India vs England: అరంగేట్రంలో అదరగొట్టిన పడిక్కల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
- సెంచరీలతో కదంతొక్కిన రోహిత్, గిల్
- అరంగేట్రం మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్ అర్ధశతకం
- బ్యాట్ ఝళిపించిన సర్ఫరాజ్ ఖాన్
- 200కి పైగా పరుగుల ఆధిక్యంలో టీమిండియా
ధర్శశాలలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లపై భారత బ్యాటర్లు విరుచుకుపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే, ఇంగ్లీష్ టీమ్‌కు వారు ఫాలో అయ్యే బజ్‌బాల్ ను రుచి చూపిస్తున్నారు. భారత బ్యాటర్లు రెచ్చిపోయి బ్యాట్ ఝళిపిస్తుంటే పర్యాటక జట్టు బౌలర్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (103), శుభమన్ గిల్ (110) సెంచరీలతో కదంతొక్కారు.
అటు అరంగేట్రం మ్యాచ్ ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్ కూడా అదరగొట్టాడు. 10 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 103 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇలా అరంగేట్రంలోనే అర్ధశతకంలో ఈ యువ ఆటగాడు ఆకట్టుకున్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ కూడా బ్యాట్ ఝళిపించాడు. హాఫ్ సెంచరీ (56) చేసి ఔటయ్యాడు. ఇలా క్రీజులోకి వచ్చిన భారత బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుండడంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోంది.
ప్రస్తుతం భారత్ స్కోర్: 420/5 ఉండగా.. ఇప్పటికే రోహిత్ సేన 202 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ధ్రువ్ జురేల్ (14), రవీంద్ర జడేజా (10) ఉన్నారు. ఇక ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.