Ganta Srinivasa Rao: రేపు మీరు గెలిచేది లేదు.. ప్రమాణ స్వీకారానికి వచ్చేది లేదు జ‌గ‌న్‌: గంటా శ్రీనివాసరావు

Ex Minister Ganta Srinivasa Rao fires on CM Jagan
  • 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా ఉన్న విశాఖ‌ను 'సిటీ ఆఫ్ డేంజర్‌'గా మార్చేశారన్న గంటా 
  •  ప్ర‌శాంతంగా వుండే విశాఖ‌ను రాజ‌ధాని పేరిట ర‌ణ‌రంగ క్షేత్రంగా మార్చారని విమర్శ 
  • ప్ర‌జ‌లు 'రావద్దు జగన్.. మాకొద్దు జగన్స‌ అంటున్నార‌ని ఎద్దేవా 
విశాఖ నుంచి సీఏంగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని, ఇక్క‌డే ఉంటాన‌ని సీఏం జ‌గ‌న్ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్స్ (ఇంత‌కుముందు ట్విట‌ర్) వేదిక‌గా స్పందించారు. అదిగో వ‌స్తా.. ఇదిగో వ‌స్తాన‌ని చెబుతూ ఐదేళ్లు కాలం వెళ్ల‌దీశార‌ని అన్నారు. 'నెలలో వస్తా.. సంక్రాంతి కి వస్తా.. ఉగాదికి వస్తా..' అంటూ ఐదేళ్ళ అంకం ముగిసిపోయింద‌ని ఎద్దేవా చేశారు. 'మీరు రేపు గెలిచేది లేదు.. ప్ర‌మాణస్వీకారానికి వ‌చ్చేది లేద‌ని' అంటూ గంటా జోస్యం చెప్పారు. 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా ఉన్న విశాఖ‌ను సీఏం జ‌గ‌న్.. 'సిటీ ఆఫ్ డేంజర్‌'గా మార్చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే విశాఖ‌ను రాజ‌ధాని పేరిట ర‌ణ‌రంగ క్షేత్రంగా మార్చార‌ని మండిప‌డ్డారు. 

అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్దితో ఉన్నామనే సంగతి ఎన్నికలకు ఒక నెల ముందు గుర్తుకొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి? అని ప్ర‌శ్నించారు. ఇక మీరు రాకముందు వరకు విశాఖ నగరం అభివృద్ధిలో దూసుకెళ్ళింద‌ని, మీరొచ్చాకే అభివృద్ధి కుంటుబడిందనేది జగమెరిగిన సత్యం అని గంటా పేర్కొన్నారు. విశాఖలో ఉన్న పరిశ్రమల్ని పొరుగు రాష్ట్రాలకు తరిమేసి, ఇప్పుడేమో విశాఖలో ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరకొడుతున్నారని ధ్వ‌జమెత్తారు. అందుకే విశాఖ ప్రజలంతా ముక్తకంఠంతో 'రావద్దు జగన్.. మాకొద్దు జగన్' అంటూ స్వరం పెంచిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గంటా శ్రీనివాస‌రావు గుర్తు చేశారు. మీ మాటలను నమ్మే పరిస్థితిలో విశాఖ వాసులు లేర‌ని, ఇక్కడి ప్రజలు చాలా తెలివైనవారని అన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం కాదు క‌దా.. ఇక్క‌డి నుంచే మీ ప్రభుత్వ పతనం మొదలవుతుందని గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి అని ట్వీట్ చేశారు.
Ganta Srinivasa Rao
Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News