Mouth freshener: గురుగ్రామ్ రెస్టారెంట్‌లో షాకింగ్ ఘటన.. ఇదిగో వీడియో!
- మౌత్ ఫ్రెషనర్ తెచ్చిన తంటా
- రక్తపు వాంతులతో బాధితుల విలవిల
- సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో
గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ భోజనం చేసిన తర్వాత ఐదుగురు కస్టమర్లు తమ నోటిని శుభ్రం చేసుకునేందుకు సిబ్బంది ఇచ్చిన మౌత్ ఫ్రెషనర్ వాడారు. అంతే.. వెంటనే వారి నోటి నుంచి రక్తం కారడంతో పాటు మంటగా ఉందంటూ వారు విలవిలలాడిపోయారు.
దాంతో వెంటనే వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితులలో ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ భయానక ఘటన తాలూకు వీడియో కాస్తా బయటకు రావడంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాధితులు రక్తపు వాంతులు చేసుకోవడం మనం చూడొచ్చు.
అసలేం జరిగిందంటే..
గ్రేటర్ నొయిడాకు చెందిన అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య, నలుగురు స్నేహితులతో కలిసి గురుగ్రామ్ పరిధిలోని సెక్టార్ 90లోని లా ఫారెస్టా కేఫ్‌కి వెళ్లారు. అక్కడ భోజనం ముగించిన తర్వాత వెయిటర్ ఇచ్చిన మౌత్ ఫ్రెషనర్ తీసుకున్నారు. అలా మౌత్‌ఫ్రెషనర్ తీసుకున్న వెంటనే వారందరూ రక్తపు వాంతులు చేసుకోవడం మొదలైంది. దాంతో పాటు నోటిలో మంటగా ఉందంటూ వారు అరవడం మొదలెట్టారు. అది గమనించిన తోటి కస్టమర్లు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రెస్టారెంట్ వారు మౌత్ ఫ్రెషనర్‌లో ఏం కలిపారో తెలియదని, దాన్ని తీసుకున్న వెంటనే నాలుకపై గాయాలు కావడం, రక్తం కారడం మొదలైందని బాధితుడు అంకిత్ కుమార్ పోలీసులకు తెలిపాడు.
అయితే, రెస్టారెంట్ వారు తమకు ఇచ్చిన మౌత్ ఫ్రెషనర్‌ను వైద్యుడికి చూపించినట్లు అంకిత్ కుమార్ తెలిపారు. ఆ ప్యాకెట్‌ను చూసిన వైద్యుడు అది డ్రై ఐస్ గా గుర్తించినట్లు చెప్పారు. ఇది యాసిడ్ వంటిదని, అది ప్రాణాలు తీస్తుందని వైద్యుడు చెప్పినట్లు బాధితుడు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.