Sai Praneeth: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు సాయి ప్రణీత్ వీడ్కోలు

Sai Praneeth Farewell to International Badminton
  • టోక్యో ఒలింపిక్స్ తర్వాత గాయాలతో ఇబ్బంది పడుతున్న షట్లర్
  • 24 ఏళ్లు నా ఊపిరిగా ఉన్న ఆటకు వీడ్కోలు పలుకుతున్నానంటూ భావోద్వేగ ప్రకటన 
  • కుటుంబ సభ్యులు, కోచ్‌లు అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ప్రణీత్
భారత షట్లర్ సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలికాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ మేరకు ప్రకటన చేశాడు. ‘‘భావోద్వేగాలతో వీడ్కోలు పదాలను రాస్తున్నాను. గత 24 ఏళ్లుగా నాకు ఊపిరిగా ఉన్న ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ రోజు నా జీవితంలో నూతన అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాను. జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆట పట్ల కృతజ్ఞతతో ఉంటాను. బ్యాడ్మింటన్ నా తొలి ప్రేమ. నా క్యారక్టర్‌ను బ్యాడ్మింటన్ రూపుదిద్దింది. నా జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చింది. ఇన్నేళ్ల ఆటలో జ్ఞాపకాలు, అధిగమించిన సవాళ్లు ఎప్పటికీ నా హృదయంలో స్థిరంగా ఉంటాయి’’ అని ప్రణీత్ భావోద్వేగంతో స్పందించాడు.

‘‘నా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్, భార్య శ్వేత అందించిన అంతులేని ప్రోత్సాహమే నా విజయానికి పునాది. మీ అచెంచల మద్దతు లేకుంటే ఇవేవీ సాధ్యమయ్యేవి కావు. పుల్లెల గోపీచంద్ అన్నకు, గోపీచంద్ అకాడమీకి, కోచింగ్, సపోర్ట్ స్టాఫ్‌ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా చిన్నప్పటి కోచ్‌లు ఆరిఫ్ సర్, గోవర్ధన్ సర్‌లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నాడు. కాగా అమెరికాలోని ట్రయాంగిల్ బ్యాడ్మింటన్ అకాడమీకి తాను ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నట్టు వెల్లడించాడు. ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలిపాడు. క్లబ్‌కు ప్రధాన కోచ్‌గా ఉంటానని తెలిపాడు.

31 ఏళ్ల వయసున్న సాయి ప్రణీత్ టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ తర్వాత గాయాలతో సతమతమవుతున్నాడు. ఈ కారణంగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రణీత్ కెరియర్ విషయానికి వస్తే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. 2017 సింగపూర్ ఓపెన్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇక అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ప్రపంచ నంబర్ 10 స్థానంలో నిలిచాడు.
Sai Praneeth
Badminton
shuttler
Pullela Gopichand

More Telugu News