Money scheem suicide: కన్నబిడ్డలను చంపేసి, చెట్టుకు ఉరేసుకున్న తండ్రి.. రంగారెడ్డి జిల్లాలో విషాదం
- ఆర్థికంగా మోసపోవడంతో బలవన్మరణం
- మనీ స్కీమ్ పేరుతో డబ్బులు వసూలు
- రెండు నెలల్లో రెండు, మూడు రెట్లు చేసి తిరిగిస్తానని హామీ
- గడువు పూర్తవడంతో డబ్బుల కోసం ఇంటికి వస్తున్న జనం
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కన్నబిడ్డలను తన చేతులతోనే చంపేశాడో తండ్రి.. ఆపై తనూ ఉరేసుకుని తనువు చాలించాడు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో సోమవారం ఉదయం చోటుచేసుకుందీ విషాదం. ఆర్థిక సమస్యలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. బంధువులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరు గ్రామానికి చెందిన రవి ఇటీవల మనీ స్కీమ్ పేరుతో ఓ స్కీమ్ లో జనాలను చేర్పించాడు. టంగుటూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ పరిచయస్తులతో డబ్బులు కట్టించాడు. కేవలం 58 రోజుల్లో డబ్బులు రెట్టింపు అవుతాయని, పెద్ద మొత్తంలో పెడితే మూడు, నాలుగు రెట్లు తిరిగి పొందవచ్చని చెప్పాడు. రవి మాటలు నమ్మి చాలామంది ఈ స్కీమ్ లో చేరారు.
రూ. వెయ్యి కడితే రూ.3 వేలు, రూ. లక్ష కడితే 58 రోజుల తర్వాత రూ.5 లక్షలు ఇప్పిస్తానని చెప్పడంతో పెద్ద మొత్తంలో డబ్బులు కట్టారు. అయితే, గడువు పూర్తయినా డబ్బులు తిరిగి రాకపోవడంతో జనం రవి ఇంటికి రావడం మొదలుపెట్టారు. నువ్వు చెబితేనే స్కీమ్ లో చేరాం, నీకే డబ్బులు కట్టాం, నువ్వే మాకు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఈ గొడవతో కలత చెందిన రవి.. ఆదివారం రాత్రి తన ముగ్గురు పిల్లలకు ఉరేసి చంపేశాడు. తర్వాత తనూ ఉరేసుకుని చనిపోయాడు.
సోమవారం ఉదయం మృతదేహాలను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, మనీ స్కీమ్ ఎవరు ప్రారంభించారు, స్కీం గురించి రవికి చెప్పిందెవరు, గ్రామస్థులు కట్టిన డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయనే వివరాలు తెలియరాలేదు. పోలీసుల విచారణ తర్వాత పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.