Viveka Murder Case: మెడికల్ క్యాంపు కోసమే కడప జైలుకు వెళ్లాను... దస్తగిరి ఆరోపణల్లో నిజం లేదు: చైతన్యరెడ్డి
- జైల్లో చైతన్యరెడ్డి తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేశాడన్న దస్తగిరి
- సీబీఐ ఎస్పీ రాంసింగ్ కొట్టాడని చెప్పాలని ఒత్తిడి చేశారని వెల్లడి
- అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న చైతన్యరెడ్డి
- మూడ్నెల్ల తర్వాత చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్న
వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి ఖైదీలకు వైద్య శిబిరం పేరుతో కడప జైల్లోకి వచ్చి తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేశారని అప్రూవర్ గా మారిన దస్తగిరి ఆరోపించడం తెలిసిందే. సీబీఐ ఎస్పీ రాంసింగ్ కొట్టినట్టు చెప్పాలని చైతన్యరెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని దస్తగిరి వెల్లడించాడు.
దస్తగిరి వ్యాఖ్యలపై డాక్టర్ చైతన్యరెడ్డి స్పందించారు. నేను దస్తగిరిని నిజంగా ఒత్తిడి చేసి ఉంటే... అతడు అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అని ప్రశ్నించారు. ఇప్పుడు మూడ్నెల్ల తర్వాత ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అని నిలదీశారు.
తాను కడప కేంద్ర కారాగారానికి వెళ్లింది ఖైదీలకు వైద్య పరీక్షల కోసమేనని, ఆ రోజు తన వెంట జైలు అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది కూడా ఉన్నారని... జైలులో ప్రతి చోట సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని చైతన్యరెడ్డి వివరించారు. దస్తగిరిది అత్యంత నేరపూరిత మనస్తత్వం అని, అతడు ఎవరి డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడో అందరికీ అర్థమవుతోందని అన్నారు.
మా నాన్న శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ కొనసాగుతోంది... ఆయనకు బెయిల్ రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చైతన్యరెడ్డి పేర్కొన్నారు. మా నాన్నకు బెయిల్ రాకపోతే మరో నాలుగైదు నెలల పాటు ఇలాంటి ఆరోపణలేవీ ఉండవు అని వ్యాఖ్యానించారు. అసలు, దస్తగిరి అప్రూవర్ గా మారడమే ఓ కుట్ర అని పేర్కొన్నారు.