ISRO Racket: అవును! జరిగింది తప్పే.. ఒప్పుకున్న తమిళనాడు ప్రభుత్వం
- తమిళనాడు మంత్రి ఇటీవల ఇచ్చిన ప్రకటనలో ఘోర తప్పిదం
- ఇస్రో రాకెట్‌పై చైనా జెండా
- ‘చిన్న పొరపాటు’ జరిగిందని ఒప్పుకున్న మంత్రి అనితా రాధాకృష్ణన్
తమిళనాడు మంత్రి అనితా రాధాకృష్ణన్ దినపత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో తప్పు జరిగిన మాట వాస్తవమేనని తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, దానిని ‘చిన్న పొరపాటు’గా పేర్కొంటూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తమిళనాడులోని కులశేఖరపట్టణంలో ఇస్రో ఏర్పాటు చేసిన సెకండ్ లాంచ్ ప్యాడ్‌కు సంబంధించి దినపత్రికల్లో మంత్రి ఇచ్చిన ప్రకటనలో ఇస్రో రాకెట్‌పై చైనా జెండా ముద్రించి ఉండడం వివాదానికి కారణమైంది. ప్రభుత్వ తీరును బీజేపీ దుయ్యబట్టింది.
స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం పరిధులు దాటేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పుకు డీఎంకే శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. మోదీ హెచ్చరికలతో స్పందించిన డీఎంకే మంత్రి తప్పును అంగీకరించారు. దినపత్రిక ప్రకటనలో చిన్న పొరపాటు దొర్లిందని పేర్కొన్నారు. అది ప్రచురితం కావడానికి ముందు తాము దానిని గుర్తించలేకపోయామని వివరణ ఇచ్చారు.