Japan Cases: జగన్ అక్రమాస్తుల విచారణ కేసు వాయిదా
- డిశ్చార్జి పిటిషన్లపై సుదీర్ఘకాలంగా విచారణ
- 2 నెలల్లో ముగించాలని గత డిసెంబర్ లో సీబీఐ కోర్టుకు ఆదేశం
- ఈ గడువును తాజాగా ఏప్రిల్ 30 వరకు పొడిగించిన తెలంగాణ హైకోర్టు
జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ గడువును తెలంగాణ హైకోర్టు పొడిగించింది. ఏప్రిల్ 30 లోగా డిశ్చార్జి పిటిషన్లను తేల్చాలంటూ సీబీఐ కోర్టును ఆదేశించింది. ఈమేరకు తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమపై దాఖలైన అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించాలంటూ జగన్ సహా మిగతా నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్లను సీబీఐ కోర్టు విచారిస్తోంది. ఈ విచారణ సుదీర్ఘకాలంగా కొనసాగుతుండడంతో తెలంగాణ హైకోర్టు కల్పించుకుంది. ఏప్రిల్ 30 లోపు విచారణ పూర్తి చేసి డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాలని సీబీఐ కోర్టుకు సూచించింది.
ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సమయంలో జగన్ కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను 2 నెలల్లో ముగించాలని డిసెంబరు 15న సీబీఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుల్లో పెద్ద సంఖ్యలో ఉన్న రికార్డులను పరిశీలించాలని, సాక్షుల వాంగ్మూలాలు సేకరించాలని సీబీఐ కోర్టు పేర్కొంది. విచారణ తుది దశకు చేరిందని, సుమారు 13వేల పేజీల డిక్టేషన్ సిద్ధంగా ఉందని సీబీఐ కోర్టు తెలిపింది. మరికొంత సమయం కావాలని కోరడంతో తెలంగాణ హైకోర్టు అనుమతించింది.