Mudragada Padmanabham: మీరు సాహసం చేయలేకపోయారు.. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు: పవన్ కు ముద్రగడ లేఖ
- అన్నీ మరిచి మీతో ప్రయాణించడానికి సిద్ధపడ్డానన్న ముద్రగడ
- చంద్రబాబు పరపతి పెరగడానికి మీరే కారకులని వ్యాఖ్య
- రెండేళ్లు సీఎం పదవి కోరి ఉండాల్సిందన్న కాపు నేత
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ కాపు జాతి చాలా బలంగా కోరుకుందని లేఖలో ముద్రగడ తెలిపారు. జాతి కోరిక మేరకు తన గతం, తన బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానని చెప్పారు. ఏపీలో కొత్త రాజకీయ ఒరవడిని తీసుకురావడానికి చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానని... మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారని నమ్మానని తెలిపారు. అయితే, దురదృష్టవశాత్తు మీరు ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు.
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కేడర్ బయటకు రావడానికే భయపడ్డారని... దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారని... అలాంటి సమయంలో మీరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడమనేది సామన్యమైన విషయం కాదని ముద్రగడ అన్నారు. చంద్రబాబు పరపతి విపరీతంగా పెరగడానికి మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనని తెలిపారు. ప్రజలంతా మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారని చెప్పారు.
పవర్ షేరింగ్ కోసం ప్రయత్నించి 80 అసెంబ్లీ సీట్లు, రెండేళ్లు సీఎం పదవిని కోరి ఉండాల్సిందని ముద్రగడ అన్నారు. ఆ సాహసం మీరు చేయలేకపోవడం బాధాకరమని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ తాను ఎప్పుడూ చేయలేదని... ఆ పరిస్థితి రాకుండా చేయమని భగవంతుడిని తరచుగా కోరుకుంటానని తెలిపారు.
మీ మాదిరి గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేనివాడిని కావడం వల్ల మీ దృష్టిలో తాను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుములాంటి వాడిగా గుర్తింపు పడటం వల్ల... మీరు తన వద్దకు వస్తానని చెప్పించి కూడా రాలేకపోయారని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవని... ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.