Satyavathi Rathod: రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడని... అందరినీ పంపించాలనుకుంటున్నాడు: సత్యవతి రాథోడ్

satyavathi rathod fires at Revanth Reddy for his comments on brs

  • మహిళల్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆరోపణ
  • సీఎం అనే సోయి మరిచి కాంగ్రెస్ నేతలా మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే అజెండాగా పెట్టుకున్నారన్న సత్యవతి రాథోడ్
  • ఆరు గ్యారెంటీల్లో ఎన్ని హామీలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా? అని నిలదీత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జైలుకు వెళ్లానని... అందరినీ జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు. ఆయన భాష కాంగ్రెస్ నాయకుడిగానే ఉందని... ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా పోయిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడటమా? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి తన పరుషపదజాలాన్ని మానుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీటును టచ్ చేసేవాళ్లు ఆయన పక్కనే ఉన్నారని... అందుకే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశారు. దళితులు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 100 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవే అన్నారు. మేడిగడ్డను రిపైర్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఎన్ని హామీలు ఉన్నాయో రేవంత్ రెడ్డికి తెలుసా? అని ఆమె నిలదీశారు. ఆరు గ్యారెంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయని తెలిపారు. మహాలక్ష్మి పథకంలోనే మూడు హామీలు ఉన్నాయన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 మాటేమిటని నిలదీశారు. రూ.500 గ్యాస్ సిలిండర్ కేవలం 40 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. మిగిలిన వారికి కూడా వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. గ్యాస్ కనెక్షన్లు పురుషుల పేరు మీద ఉన్నా సబ్సిడీ వర్తింపచేయాలన్నారు.

మహిళలకు ఉచిత బస్సు పథకం సరే కానీ సరిపడా బస్సులు నడపడం లేదన్నారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను పంపించాలని సూచించారు. రూ.4 వేల పెన్షన్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధపడిందన్నారు. ఆరు గ్యారెంటీలని చెప్పి ఇప్పుడు ఆరు వందల కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News