Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి మృతి.. శ్రీలంకకు మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు
- చెన్నైలోని ఆసుపత్రిలో ఈ ఉదయం మృతి చెందిన శాంతన్
- లివర్ దెబ్బతినడంలో అనారోగ్యంపాలైన శాంతన్
- శాంతన్ వయసు 55 సంవత్సరాలు
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి, జీవిత ఖైదు అనుభవించి విడుదలైన శాంతన్ మృతి చెందాడు. అనారోగ్యంతో తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన... ఈ తెల్లవారుజామున మరణించాడు. ఆయన వయసు 55 సంవత్సరాలు. లివర్ దెబ్బతినడంలో ఆయన చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. ఆయనను కాపాడేందుకు వైద్యులు ఎంతో ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఈ ఉదయం 7.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని శ్రీలంకకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో ఇతర దోషులతో పాటు శాంతన్ జైలు శిక్షను అనుభవించాడు. 2022లో సుప్రీంకోర్టు వీరికి స్వేచ్ఛను ప్రసాదించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ముగ్గురు దోషులతో కలిసి తిరుచ్చిలోని స్పెషల్ క్యాంప్ లో శాంతన్ ఇన్నాళ్లు వున్నాడు.