Chinmayi Sripada: అత్యాచారాలపై అన్నపూర్ణమ్మ వ్యాఖ్యల పట్ల చిన్మయి శ్రీపాద ఆశ్చర్యం... వీడియో ఇదిగో!

Chinmayi Sripada reacts to Annapurnamma comments
  • ఓ ఇంటర్వ్యూలో అత్యాచారాలపై స్పందించిన నటి అన్నపూర్ణమ్మ
  • కొంచెం ఆడవాళ్లది కూడా తప్పు ఉంటుందన్న కోణంలో వ్యాఖ్యలు
  • అర్ధరాత్రి వేళ బయటికి రావడం ఎందుకని ప్రశ్న
  • అమ్మాయిలు కురచ దుస్తులు ధరిస్తున్నారని వెల్లడి
  • ఇలాంటి వాళ్లున్న దేశంలో పుట్టడం మన ఖర్మ అంటూ చిన్మయి విచారం 
టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటే అందులో కొంచెం ఆడవాళ్లది కూడా తప్పు ఉందని అన్నపూర్ణమ్మ అభిప్రాయపడ్డారు. మహిళలు అర్ధరాత్రి తిరగడం ఎందుకు? అని ప్రశ్నించారు. మహిళలు కురచ దుస్తులు ధరించడం కూడా అఘాయిత్యాలకు కారణమన్న రీతిలో అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలు ఉన్నాయి. 

దీనిపై చిన్మయి శ్రీపాద ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలను కూడా ఆ వీడియోలో చూడొచ్చు. ఓ యాక్టర్ గా అన్నపూర్ణమ్మను తాను చాలా ఇష్టపడతానని, కానీ ఆడవాళ్ల స్వేచ్ఛపై ఆమె మాట్లాడిన విషయాలను తనకు దిగ్భ్రాంతి కలిగించాయని చిన్మయి అన్నారు. 

అన్నపూర్ణమ్మ అభిప్రాయం ప్రకారం... సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు ఆడవాళ్లు ఎవరూ బయటికి రాకూడదా? ఆడవాళ్లకు ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చినా, వారికేదైనా ప్రమాదం జరిగినా అది సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలోనే జరగాలా? అంటూ ప్రశ్నించారు. 

అన్నపూర్ణమ్మ చెప్పిన ప్రకారం అయితే... రాత్రివేళ ఆసుపత్రుల్లో మహిళా గైనకాలజిస్టులు ఎవరూ ఉండకూడదేమో... పిల్లలు కూడా పగటి పూటే పుట్టాలేమో అని సందేహం వ్యక్తం చేశారు. 

కేవలం అమ్మాయిలు ధరించే దుస్తులు, వారి వేషధారణ వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయని అనుకునే ఇలాంటివారు ఉన్న భారతదేశంలో ఆడపిల్లలుగా పుట్టడం మన ఖర్మ అని చిన్మయి శ్రీపాద తన పోస్టులో పేర్కొన్నారు.
Chinmayi Sripada
Annapurnamma
Women
Tollywood

More Telugu News