Rahul Gandhi: కర్ణాటక సీఎం సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు సమన్లు
- రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై బీజేపీ పరువునష్టం దావా
- 40 శాతం కమిషన్ల పేరిట తమపై పేపర్లో యాడ్స్ ఇచ్చారంటూ ఆరోపణ
- పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం
- కోర్టు ముందు హాజరు కావాలని రాహుల్, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌కు నోటీసులు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు కోర్టు ముందు హాజరుకావాలంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశాలిచ్చారు.
బీజేపీ పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎస్.శివప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైపై 40 శాతం కమిషన్ ఆరోపణలు చేస్తూ పేపర్లలో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చారన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీని కూడా ఈ కేసులో సెక్షన్ 499, సెక్షన్ 500 కింద కక్షిదారుగా చేర్చాలని స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని చెప్పింది.
కర్ణాటకలో అప్పటి ప్రభుత్వం 40 శాతం కమిషన్లు వసూలు చేస్తోందని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తొలుత కాంగ్రెస్ నేతలు తమ ప్రసంగాల్లో మాత్రమే ఈ ఆరోపణలు చేసేవారు. ఆ తరువాత సోషల్ మీడియాలో కూడా మొదలైన ఆరోణల పర్వం చివరకు ప్రధాన మీడియాలో యాడ్స్ రూపంలోనూ కనిపించింది. అంతేకాకుండా, కొందరు రాష్ట్ర వ్యాప్తంగా ‘40 శాతం కమిషన్‌ల’ పోస్టర్లు పెట్టారు. చివరకు ఇది వివాదాస్పదంగా మారింది.