DSC-2024: ఏపీ డీఎస్సీ-2024: దరఖాస్తుల గడువు పొడిగింపు
- నేటితో ముగియనున్న పాత గడువు
- ఫిబ్రవరి 25 వరకు పొడిగిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటన
- దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్
ఏపీలో 6,100 టీచర్ పోస్టులతో ఇటీవల డీఎస్సీ ప్రకటించారు. నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వాస్తవానికి నేటితో దరఖాస్తు ఫీజు చెల్లింపునకు గడువు ముగియనుంది. అయితే, ఆ గడువును పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం నేడు ప్రకటించింది. డీఎస్సీ అభ్యర్థులు ఫిబ్రవరి 25 రాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తాజా ప్రకటనలో వెల్లడించింది.
అంతేకాదు, దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవడానికి ఎడిట్ ఆప్షన్ కల్పిస్తున్నట్టు తెలిపింది. https://apdsc.apcfss.in/ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తును ఎడిట్ చేసుకుని తప్పులను సరిచేసుకోవచ్చని సూచించింది. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరంలేదు.
అయితే, ఎడిట్ ఆప్షన్ ద్వారా అభ్యర్థి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా పేరు సవరించుకోవడం కుదరదు. అవి తప్ప మిగతా కాలమ్స్ ను సవరించుకోవచ్చు. అభ్యర్థి పేరు దరఖాస్తులో తప్పుగా పేర్కొంటే... పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్స్ లో సంతకం చేసేటప్పుడు సవరించుకోవచ్చు.