Houthi: ఎర్ర సముద్రంలో మరో నౌకపై హౌతీ మిలిటెంట్ల దాడి.. తొలిసారి నౌకను విడిచిపెట్టిన సిబ్బంది

In A First Crew Abandons Ship In Red Sea After Houthi Missile Strikes

  • బెలిజ్‌ దేశానికి చెందిన నౌకపై యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి
  • ధ్వంసమైన కొంత భాగం.. మొట్టమొదటిసారి నౌకను వదిలిపెట్టిన సిబ్బంది
  • నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయిందన్న హౌతీ ప్రతినిధి

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా హౌతీ మిలిటెంట్ గ్రూప్ ఆగడాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో కమర్షియల్ షిప్‌పై దాడి జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం సెంట్రల్ అమెరికా దేశం బెలిజ్‌ దేశానికి చెందిన రూబీమార్‌ నౌకపై హౌతి మిలిటెంట్లు దాడి చేశారని యూఎస్ సెంట్రల్ కమాండ్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. రెండు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయడంతో నౌక దెబ్బతిందని వెల్లడించింది. ఈ దాడితో సిబ్బంది ఓడను విడిచిపెట్టారని వివరించింది. కాగా గత ఏడాది చివరి నుంచి హౌతీ మిలిటెంట్ గ్రూప్ సముద్ర జలమార్గంలో వాణిజ్య కార్యకాలపాలకు ఆటంకం కలిగిస్తోంది. అయితే సిబ్బంది ఈ విధంగా నౌకను వదిలిపెట్టడం ఇదే మొదటిసారి. సిబ్బంది సహాయం కోరడంతో ఒక సంయుక్త యుద్ధనౌక, మరో వ్యాపార నౌక స్పందించాయి. రూబీమార్ సిబ్బందిని సమీపంలోని పోర్ట్‌కు సురిక్షితంగా తీసుకెళ్లాయి.

దాడి కారణంగా గుర్తు తెలియని బ్రిటీష్ నౌకపై పూర్తిగా మునిగిపోయిందని హౌతీ ప్రతినిధి ఒక పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. రూబీమార్ నౌక చిన్న కార్గో షిప్ అని, దీని యజమాని ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోందని రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా గతేడాది నవంబర్ నుంచి హౌతీ మిలిటెంట్లు యెమెన్ తీరంలో క్షిపణులు, డ్రోన్లతో వాణిజ్య నౌకలపై దాడి చేస్తున్నారు. ఇరాన్ సహకారంతో సముద్రంలో వాణిజ్య రవాణాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, యూకేలతో ముడిపడిన నౌకలను లక్ష్యంగా  చేసుకొని దాడులు చేస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతిస్పందనగా ఈ దాడులకు తెగబడుతున్నారు.

More Telugu News