Kodali Nani: గుడివాడ టికెట్ ఎవరికో జగన్ చెపుతారు.. పకోడీగాళ్లకు ఏం సంబంధం?: కొడాలి నాని ఫైర్

Kodali Nani fires on flex against him in Gudivada

  • ఎవడో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయాన్నే తీసేశాడన్న కొడాలి నాని
  • గుడివాడ నుంచి తాను, గన్నవరం నుంచి వంశీ పోటీ చేస్తామని ధీమా
  • చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్

ఏపీలో అధికార వైసీపీలో మార్పులు, చేర్పులు ఆ పార్టీ నేతల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగులకు పార్టీ హైకమాండ్ మొండి చేయి చూపించింది. కీలక నేతలకు కూడా సీట్లు దక్కకపోవచ్చనే ప్రచారం కూడా సాగుతోంది. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే, జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుగాంచిన కొడాలి నాని పేరు తెరపైకి వచ్చింది. ఈసారి గుడివాడ టికెట్ ను నానికి ఇవ్వడం లేదనే వార్తలు నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. ఆయన స్థానంలో మండవ హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో కొడాలి నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో ఎవరు పోటీ చేయాలనేది తమ అధినేత జగన్ చెపుతారని... మధ్యలో ఉన్న పకోడీగాళ్లకు ఏం సంబంధమని మండిపడ్డారు. వినేవాడు తెలుగు తమ్ముళ్లైతే, చెప్పేవాడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా జగన్ సీటు ఇచ్చారని చెప్పారు. వైరవీలు చేస్తేనో, బ్రోకర్ పనులు చేస్తేనో, డబ్బుందనో, ఎవరో చెప్పారనో వైసీపీలో టికెట్లు ఇవ్వరని అన్నారు. జగన్ లా చంద్రబాబు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

గుడివాడలో హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారంటూ వెలసిన ఫ్లెక్సీలపై కొడాలి నాని స్పందిస్తూ... ఎవడో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి, ఉదయాన్నే తీసేశాడని అన్నారు. దమ్ముంటే తనను ఓడించడానికి చంద్రబాబు గుడివాడలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. జగన్ శాశ్వతంగా సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే తనకు, వల్లభనేని వంశీకి సీట్లు లేవంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ నుంచి తాను, గన్నవరం నుంచి వంశీ పోటీ చేస్తామని చెప్పారు.

More Telugu News