KCR: ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి కేసీఆర్.. ఎవరిని కలవబోతున్నారనే దానిపై ఉత్కంఠ!
- ఈ వారంలోనే ఢిల్లీకి వెళ్లబోతున్న కేసీఆర్
- బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ప్రచారం
- రెండు, మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ వారంలోనే ఆయన ఢిల్లీ టూర్ ఉంటుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటం ఇదే తొలిసారి. తుంటి ఎముక విరిగిన తర్వాత కేసీఆర్ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. ఎవరి సాయం లేకుండా చేతికర్ర సాయంతో ఆయన నడవగలుగుతున్నారు. నల్గొండ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొన్నారు.
మరోవైపు, రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. రాజకీయ విశ్లేషకులు సైతం దీనిపై పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటంపై ఆసక్తి నెలకొంది. అయితే, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవరిని కలవబోతున్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పర్యటనకు సంబంధించిన అజెండాపై కూడా వివరాలు వెల్లడి కాలేదు. రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ పర్యటనపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవచ్చనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఇంకోవైపు, బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.