Harish Rao: కేసీఆర్ పేరు చెడగొట్టాలనేది రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశ్యం: హరీశ్ రావు

Harish Rao fires at revanth reddy for white papers

  • కావాలనే మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్‌ను ఆలస్యం చేస్తున్నారని ఆరోపణ
  • లేకపోతే రిపేర్ చేయడానికి ఆలస్యం ఎందుకో చెప్పాలని నిలదీత
  • తమపై కోపంతో రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి

తమ పార్టీ అధినేత కేసీఆర్ పేరు చెడగొట్టాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశ్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కావాలనే మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్‌ను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. లేకపోతే రిపేర్ చేయడానికి ఆలస్యం ఎందుకో చెప్పాలని నిలదీశారు. తమపై కోపంతో రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులకు సంబంధించి ఏ విచారణకైనా తాము సిద్ధమని మూడోసారి చెబుతున్నానని అన్నారు. నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో అన్నీ అవాస్తవాలే అన్నారు. గత ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఈ శ్వేతపత్రాన్ని తీసుకు వచ్చారని ఆరోపించారు. కొన్ని ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పూర్తయినట్లు మంత్రులు చెప్పారని కానీ అందులో నిజం లేదన్నారు. మిడ్ మానేరు 2014లో తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయానికి రూ.106 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయని... బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.775 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేసిందన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై మాట్లాడుతూ... లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారని... కానీ అందులో నిజం లేదన్నారు. తాము కేంద్రానికి ఫిర్యాదు చేశామని... ఆ లేఖలు కావాలంటే సభలో ప్రవేశపెడతామన్నారు.

  • Loading...

More Telugu News