Charlapalli Railway station: చర్లపల్లి స్టేషన్ నుంచి 25 రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
- తొలి విడతలో 3 ఎక్స్‌ప్రెస్‌లకు రైల్వే బోర్డు అనుమతి
- మరో ఆరు రైళ్లు స్టేషన్‌లో ఆగేలా ఆదేశాలు
- మార్చి మొదటి వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా స్టేషన్ ప్రారంభం
జంటనగరాల్లోని సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు తోడుగా సిద్ధమవుతున్న చర్లపల్లి స్టేషన్ నుంచి 25 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది. ఇతర స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దిశగా రైల్వే బోర్డుకు అనుమతులు కోరుతూ లేఖ రాయగా 3 రైళ్లకు సంబంధించి అనుమతులు వచ్చాయి. మరో 6 ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా చర్లపల్లిలో ఆపేందుకు బోర్డు అనుమతించింది.
ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎంతో పాటు ఇతర జీఎంలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్పుల సమాచారం ప్రజలందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రైల్వే బోర్డు ఆదేశించింది. ఎప్పటి నుంచి స్టేషన్ సేవలను వినియోగించుకోవచ్చనే నిర్ణయాన్ని స్థానిక అధికారులకు కట్టబెట్టింది. కాగా, మార్చి మొదటి వారంలో ప్రధాని మోదీ చర్లపల్లి స్టేషన్‌ను జాతికి అంకితం చేస్తారని కిషన్ రెడ్డి ఇటీవలే తెలిపారు.
చర్లపల్లి నుంచి ప్రారంభం కానున్న రైళ్లు
- 18045/18046 షాలీమార్- హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్
- 12603/12604 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- 12589/12590 గోరఖ్‌పూర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
చర్లపల్లిలో ఆగే రైళ్లు
- 17011/17012 హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
- 12757/12758 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
- 17201/17202 గుంటూరు - సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్
- 17233/17234 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
- 12713/12714 విజయవాడ - సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్
- 12705/12706 గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్