NRI: భారతీయ పౌరులను పెళ్లి చేసుకునే ఎన్నారైలకు కఠిన నిబంధనలు.. సిఫార్సులు ఇవే!

Law Commission recommends strict rules to deal with NRIs and OCIs marrying Indian citizens

  • భారత్‌లో వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సిఫార్స్ చేసిన లా కమిషన్
  • పాస్‌పోర్టులో మ్యారేజ్ స్టేటస్‌తో పాటు భాగస్వామి పేరుని కూడా చేర్చాలని ప్రాతిపాదన
  • న్యాయశాఖకు సిఫార్సులు పంపించిన రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ నేతృత్వంలోని లా కమిషన్

ఎన్నారై వ్యక్తులు భారతీయ పౌరులను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న ఘటనలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ సమగ్రమైన కఠిన చట్టం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ‘లా కమిషన్’ నూతన చట్టం రూపకల్పనకు కీలకమైన సిఫార్సులు చేసింది. ఎన్నారైలకు సంబంధించిన వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది. ఈ మేరకు ‘ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహాల సమస్యలపై సమగ్ర చట్టం’ పేరిట కీలకమైన సిఫార్సులతో కూడిన రిపోర్టును న్యాయ మంత్రిత్వశాఖకు లా కమిషన్ అందజేసింది. ప్రతిపాదిత చట్టం సంపూర్ణంగా, సమగ్రంగా ఉండాలని రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సూచించింది. ఎన్నారైలు, భారత సంతతి వ్యక్తులతో ముడిపడిన వివాహాలకు సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పెట్టేలా ఉండాలని సూచించింది.

ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌‌కు రాసిన లేఖలో రిటైర్డ్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నారైలు భారతీయులను పెళ్లి చేసుకొని మోసగిస్తున్న ఘటనలు పెరిగిపోవడం ఆందోళనకరమని అన్నారు. జీవిత భాగస్వాములను ముఖ్యంగా స్త్రీలను హానికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. తీసుకురాబోయే కఠిన చట్టాన్ని ఎన్నారైలకు మాత్రమే కాకుండా భారత సంతతి వ్యక్తులకు కూడా వర్తింపజేయాలని రీతు రాజ్ అవస్తీ సూచించారు. అన్ని వివాహాలను భారత్‌లో రిజిష్టర్ చేయాలన్నారు. విడాకులు, జీవిత భాగస్వామి పోషణ, పిల్లల సంరక్షణ, సర్వింగ్ సమన్లు, వారెంట్లు, జుడీషియల్ డాక్యుమెంట్లు వంటి అంశాలు ఈ చట్టంలో ఉండాలని పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ను సవరించి జీవిత భాగస్వామి పేరు, వివాహ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కూడా పాస్‌పోర్టులో చేర్చేలా పాస్‌పోర్ట్ చట్టం-1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని సిఫార్సు చేశారు.

  • Loading...

More Telugu News