YS Sharmila: ప్రజా ధనాన్ని దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి తప్పించుకోలేడు: షర్మిల

Sharmila tweets on CAG report over Kaleswaram issue
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ తాజా నివేదిక
  • ఇది గుదిబండ ప్రాజెక్టు అని వెల్లడి
  • ప్రయోజనాల కంటే ఖర్చులే ఎక్కువ అని స్పష్టీకరణ
  • రుణాలు దారి మళ్లాయని వ్యాఖ్యలు
  • తాము అప్పుడే చెప్పామన్న షర్మిల 
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రంగానికి పెనుభారం వంటిదని కాగ్ తన తాజా నివేదికలో పేర్కొనడం తెలిసిందే. ప్రాజెక్టు వ్యయం, ప్రయోజనాల నిష్పత్తి రీత్యా ఇది గుదిబండ వంటిదని కాగ్ అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులు, వడ్డీలను 2035 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని పేర్కొంది. 

ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలను దారిమళ్లించారని, ఒప్పందంతో పోల్చితే నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచేశారని కాగ్ వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.63,352 కోట్ల నుంచి రూ.1,02,267.99 కోట్లకు పెరిగిందని వివరించింది. 

కాగ్ నివేదిక నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని, నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితమవుతోందని షర్మిల ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేడని స్పష్టం చేశారు. 

షర్మిల తన ట్వీట్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ 2022 అక్టోబరు 21న కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీసీ ముర్ముకు సాక్ష్యాధారాలు సమర్పించినప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతమాత్రం ఆచరణ సాధ్యం కాదని ఇప్పుడు కాగ్ నివేదిక చెబుతోందని షర్మిల పేర్కొన్నారు.
YS Sharmila
Kaleswaram
CAG
KCR
Telangana

More Telugu News