USA: కదులుతున్న కారు నుంచి కాల్పులు.. అమెరికాలో ఐదుగురి మృతి

Five killed in drive by shooting at Puerto Rican bar In America

  • ప్యూర్టో రికోలో దుండగుల కాల్పులు
  • మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు స్త్రీలు
  • డ్రగ్స్ రవాణాతో ముడిపడిన ఘటనగా అనుమానిస్తున్న పోలీసులు

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ప్యూర్టో రికోలో కొంతమంది దుండగులు కదులుతున్న కారు నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్యూర్టో రికోలోని ప్యూర్టో రికన్ బార్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని వివరించారు. గాయపడ్డవారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడని తెలిపారు. బాధితులను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించామని, గాయపడ్డవారిలో కాటానో పట్టణ మాజీ మేయర్ సోదరుడు కూడా ఉన్నాడని తెలిపారు. కాగా ఈ కాల్పుల ఘటన డ్రగ్స్ అక్రమ రవాణాతో ముడిపడినదని అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో డ్రగ్స్ రవాణా జరుగుతున్నప్పటికీ కాల్పులు చోటు చేసుకోవడం అసాధారణ ఘటనగా పోలీసులు అభివర్ణించారు.

కాల్పుల్లో చనిపోయిన ఓ 35 ఏళ్ల వ్యక్తిని డ్రగ్స్ వ్యాపారిగా అనుమానిస్తున్నామని, అతడిని లక్ష్యంగా చేసుకొని ఈ కాల్పులకు తెగబడ్డారని భావిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని వెల్లడించారు. ఇదిలావుంచితే.. ప్యూర్టో రికో ద్వీపంలో సాధారణంగా క్రైమ్ రేటు తక్కువగా ఉంటుంది. అయితే ఈ ఏడాది ఆ సంఖ్య పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటికే 74 హత్యలు జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత నెలలోనే సెయిబా పట్టణంలో డ్రగ్స్ సంబంధిత దాడి జరిగింది. ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News