Congress: ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

Congress MLC Balmuri Venkat came to the assembly in RTC bus

  • నాంపల్లిలో బస్సు ఎక్కి అసెంబ్లీ వద్ద దిగిన వెంకట్ 
  • ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ
  • గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బల్మూరి  

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల కోసం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వచ్చారు. నాంపల్లిలో బస్ ఎక్కిన వెంకట్ అసెంబ్లీ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై మహిళలు సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు మాత్రమే ఉచితం. కాబట్టి ఎమ్మెల్సీ వెంకట్ కండక్టర్‌కు డబ్బులు ఇచ్చి టిక్కెట్ కూడా తీసుకున్నారు.

గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు

వెంకట్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమరవీరుల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. విద్యార్థుల పక్షాన చేసిన పోరాటాన్ని గుర్తించి వారికి ప్రతినిధిగా తనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర అగ్రనాయకులు శాసన మండలికి పంపించారని పేర్కొన్నారు.

తాను పదేళ్లపాటు యువకుల పక్షాన పోరాటం చేశానని బల్మూరి వెంకట్ తెలిపారు. ఇప్పుడు ఆ యువ'కులం' సమస్యలు తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని అమరవీరుల సాక్షిగా హామీ ఇస్తున్నానన్నారు. విద్యార్థులు, యువకులు ఎలాంటి సమస్య వున్నా తన దృష్టికి తీసుకు రావొచ్చునన్నారు. ఎప్పటికి తన కులం యువ'కులమే' అన్నారు. ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.

  • Error fetching data: Failed to fetch

More Telugu News