Chandrababu: అయ్యన్న పాత్రుడిపై రేప్ కేసు పెట్టారు: చంద్రబాబు

Chandrababu fires on Jagan

  • జగన్ పాలనలో ఒక్కో కుటుంబంపై రూ. 8 లక్షల భారం పడిందన్న చంద్రబాబు
  • సలహాదారుల పేరుతో రూ. 700 కోట్లు ఖర్చు చేశారని విమర్శ
  • రూ. 40 వేల కోట్ల భూములను కబ్జా చేశారని ఆరోపణ

ఎన్నికలకు మరో 64 రోజుల సమయం మాత్రమే ఉందని... రాష్ట్రంలో టీడీపీ - జనసేన ప్రభుత్వం రాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. జగన్ పాలనలో ప్రతి కుటుంబం నష్టపోయిందని అన్నారు. జగన్ పాలనలో ఒక్కో కుటుంబంపై రూ. 8 లక్షల భారం పడిందని అన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విశాఖ రైల్వే జోన్ కు 53 ఎకరాల భూమిని కూడా ఇవ్వని దుర్మార్గుడు జగన్ అని చెప్పారు. అక్రమ కేసులు పెట్టి తనను జైల్లో పెట్టారని, సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిపై రేప్ కేసు పెట్టారని విమర్శించారు. జగన్ బటన్ నొక్కి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, విద్యుత్ ఛార్జీల రూపంలో రూ. 64 వేల కోట్ల భారం వేశాడని, పెట్రోల్ భారం మోపాడని, చెత్తపై పన్ను వేశాడని, నిత్యావసరాల ధరలు పెంచి జనం నడ్డి విరిచాడని దుయ్యబట్టారు. సలహాదారుల పేరుతో రూ. 700 కోట్లు ఖర్చు పెట్టాడని, సజ్జలకు రూ. 150 కోట్ల సంపదను దోచి పెట్టాడని అన్నారు. 

మద్య నిషేధానికి జగన్ ఎందుకు బటన్ నొక్కలేదని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదని అడిగారు. గెలవక ముందు తలపై ముద్దులు పెట్టాడని, బుగ్గలు నిమిరాడని, ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. విశాఖలోని రుషికొండను అనకొండలా మింగేశాడని దుయ్యబట్టారు. రూ. 40 వేల కోట్ల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News