Gautam Gambhir: జైస్వాల్ డబుల్ సెంచరీపై అతి ప్రచారం వద్దు: గంభీర్
- విశాఖ టెస్టులో ఇంగ్లండ్ పై జైస్వాల్ డబుల్ సెంచరీ
- జైస్వాల్ వయసు 22 ఏళ్లు
- భారత్ తరఫున డబుల్ సాధించిన పిన్నవయస్కుల్లో మూడోవాడు జైస్వాల్
- ఆకాశానికెత్తేస్తే సహజసిద్ధమైన ఆట ఆడలేడన్న గంభీర్
- జైస్వాల్ పై అంచనాల ఒత్తిడి పెంచవద్దని హితవు
విశాఖ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) ఇంగ్లండ్ పై అద్భుత డబుల్ సెంచరీ సాధించడం పట్ల మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. జైస్వాల్ కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాధించడం పట్ల గంభీర్ అభినందించాడు. అయితే, జైస్వాల్ ఇంకా కుర్రవాడేనని, అతడి డబుల్ సెంచరీకి మితిమీరిన ప్రచారం కల్పించవద్దని హితవు పలికాడు.
అతడిని ఆకాశానికి ఎత్తివేస్తే, అది అతడి ఆటతీరుపై ప్రభావం చూపుతుందని, అంచనాలు పెరిగి తీవ్ర ఒత్తిడితో ఆట గాడితప్పుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఏంటంటే... జైస్వాల్ ను మరీ ఎక్కువగా పొగడవద్దు... అతడి సహజసిద్ధమైన ఆట ఆడనివ్వండి అని పిలుపునిచ్చాడు.
"భారత క్రికెట్ రంగంలో మనకు ఓ లక్షణం ఉంది. ఎవరైనా ఆటగాడు బాగా ఆడితే అతడికి అతిగా ప్రచారం కల్పిస్తాం. ముఖ్యంగా మీడియా గురించి చెప్పాలి. ఆటగాళ్లకు బిరుదులు తగిలించి, హీరోలను చేసేస్తుంది. గతంలో ఇలాంటివి చూశాం. ఆటగాడిపై ఒత్తిడి నెలకొంటే అతడి సహజసిద్ధమైన ఆట ఆడలేడు. మనం సంయమనంతో వ్యవహరించి, జైస్వాల్ ను ఎదగనిద్దాం, అతడి ఆటను ఆస్వాదిద్దాం" అంటూ గంభీర్ సూచించాడు.