K Kavitha: ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రభుత్వ ఖర్చుతో హైదరాబాద్‌కు తరలించారు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha says brs will protest against priyanka gandhi

  • పథకాల అమలుకు ప్రియాంకగాంధీని పిలిస్తే నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన తెలుపుతామన్న కవిత
  • ప్రతిరోజు ప్రజలను కలుస్తానని చెప్పి ఒక్కరోజు మాత్రమే కలిశారని విమర్శ
  • ప్రభుత్వ హామీలపై 100 రోజుల తర్వాత ప్రజాక్షేత్రంలో కచ్చితంగా నిలదీస్తామని హెచ్చరిక

ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చుతో హైదరాబాద్‌కు తరలించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీ అమలుకు కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీని పిలుస్తామని చెబుతున్నారని... ఆమెను ఏ హోదాలో పిలుస్తున్నారో చెప్పాలని కవిత నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఏ హోదా లేని ప్రియాంకను ఎలా పిలుస్తారు? అని నిలదీశారు. ఆమెను పిలిస్తే తాము నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలుపుతామన్నారు.

ఇంద్రవెల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంద్రవెల్లిలో ఉదయం ప్రభుత్వ కార్యక్రమం జరిగితే సాయంత్రం పార్టీ సభ నిర్వహించారన్నారు. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం కాదా? అని నిలదీశారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో జరిగిన సభ ఖర్చు ఎంత? సీఎం రేవంత్ రెడ్డి చార్టర్డ్ విమానాల్లో ఢిల్లీకి వెళుతున్నారు... ఆయన ఢిల్లీ పర్యటనల ఖర్చు ఎంత? అన్నది చెప్పాలని నిలదీశారు. తనకు కాన్వాయ్ అవసరం లేదని సీఎం చెప్పారని... కానీ ఇప్పుడు ఆయన కాన్వాయ్ హైదరాబాద్‌లో వెళుతుంటే ట్రాఫిక్ జామ్ అవుతోందన్నారు.

ప్రతిరోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ఒక్కరోజు మాత్రమే కలిశారన్నారు. ప్రజాదర్బార్ అని చెప్పి అక్కడకు కూడా వెళ్లడం లేదని విమర్శించారు. ప్రజాదర్బార్ ఒకరోజు మురిపమే అన్నారు. అందుకే ఆయనను యూటర్న్ సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. తాము పరిపాలనా వికేంద్రీకరణ కోరుకుంటే... కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో కేంద్రీకరణ కోరుకుంటోందని ఆరోపించారు. ప్రతిరోజూ కేసీఆర్‌పై ఏడ్చే రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో 22 కుటుంబాలకు టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన కాదా? అని నిలదీశారు. ప్రభుత్వ హామీలపై 100 రోజుల తర్వాత ప్రజాక్షేత్రంలో కచ్చితంగా నిలదీస్తామని హెచ్చరించారు.

More Telugu News