Nara Bhuvaneswari: మీతో మేమున్నాం... అధైర్యపడకండి: బాధిత కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా

Nara Bhuavaneswari nijam gelavali tour
  • 'నిజం గెలవాలి' పర్యటనలో భాగంగా మొదటి రోజు గుంటూరులో పర్యటించిన భువనేశ్వరి 
  • రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి
  • ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను తట్టుకోలేక మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి మంగళవారం పరామర్శించి, వారికి భరోసా ఇచ్చారు. మీతో మేమున్నాం... అధైర్యపడవద్దని చెప్పారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 'నిజం గెలవాలి' పర్యటనలో భాగంగా మొదటి రోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పర్యటించారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో నాలుగు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

'నిజం గెలవాలి' కోసం విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి కృష్ణా జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా మొదట రేపల్లె నియోజకవర్గానికి చేరుకున్నారు. చెరుకుపల్లి మండల కేంద్రంలో... పార్టీ కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 09-09-2023న చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో వెంకటేశ్వరరావు (67) మృతి చెందారు. వెంకటేశ్వరరావు భార్య కోట విజయలక్ష్మి, కుమారులు సురేష్, రాజేష్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. 

పర్చూరులో...

ఆ తర్వాత పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు మండలం, చిననందిపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త మువ్వ సింగారావు కుటుంబాన్ని పరామర్శించారు. 05-10-2023న సింగారావు (52) గుండెపోటుతో మృతి చెందారు. సింగారావు భార్య పార్వతి, తల్లి మస్తానమ్మ, కుమార్తెలు కళ్యాణి, హిమబిందులను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్త టెక్కెం నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. 10-09-2023న గుండెపోటుతో నాగేశ్వరరావు (57) మృతి చెందారు. నాగేశ్వరరావు భార్య దేవునిదయ, కుమార్తె వెంకటరత్నం, తల్లి నాగరత్నంలను ఓదార్చారు. నాగేశ్వరరావు కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందించారు.

ఒంగోలులో...

అటు నుంచి ఒంగోలు రూరల్ నియోజకవర్గం, ముక్తినూతలపాడు గ్రామంలో పార్టీ కార్యకర్త సూదనగుంట వెంకటరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. 13-10-2023న వెంకటరావు (50) గుండెపోటుతో మృతి చెందారు. వెంకటరావు తమ్ముడు వేణు, తండ్రి శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి ధైర్యం చెప్పారు. వెంకటరావు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షలు చెక్కును అందించారు. మొదటిరోజు కార్యక్రమం ముగిసిన అనంతరం ఒంగోలులోని బృందావనం కన్వెన్షన్ సెంటర్ వద్ద బస చేశారు.

భువనేశ్వరికి వెల్లువెత్తిన మహిళల మద్దతు, సంఘీభావం

'నిజం గెలవాలి' మొదటి రోజు కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున భువనేశ్వరికి మద్దతు తెలిపారు. రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాల ఇళ్ల వద్ద మహిళలు పెద్దఎత్తున చేరుకుని ఆమెకు సంఘీభావం తెలిపారు. నిజం గెలవాలి.... నిజమే గెలవాలి అంటూ నినాదాలు చేశారు. తనను చూసేందుకు వచ్చిన మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు భువనేశ్వరి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భువనేశ్వరితో కరచాలనం చేసి, ఫోటోలు దిగేందుకు పిల్లలు, మహిళలు పెద్దఎత్తున పోటీపడ్డారు.


Nara Bhuvaneswari
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Telugu News