Hemant Soren: అజ్ఞాతంలో సీఎం హేమంత్ సొరేన్.. ఆయన భార్యకు సీఎం పగ్గాలు?

Hemant Soren missing

  • మనీ లాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న హేమంత్ సొరేన్
  • ఢిల్లీకి వెళ్లిన తర్వాత కనపించకుండా పోయిన సొరేన్
  • రాజకీయ కుట్రల్లో భాగంగా సొరేన్ ను ఈడీ వేధిస్తోందని జేఎంఎం మండిపాటు

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నారనే వివరాలు బయటకు రావడం లేదు. ఝార్ఖండ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ..  ఢిల్లీలోని నివాసం నుంచి సొరేన్ రాత్రి కాలి నడకన పారిపోయారని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించాలని రాష్ట్ర గవర్నర్ కు తెలియజేశారు.  

మరోవైపు సొరేన్ పార్టీ నేతలు స్పందిస్తూ... రాంచీకి ఆయన త్వరలోనే చేరుకుంటారని చెప్పారు. రాజకీయ కుట్రల్లో భాగంగానే సొరేన్ ను ఈడీ వేధిస్తోందని మండిపడ్డారు. పార్టీ జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య మాట్లాడుతూ... వ్యక్తిగత పనులపై సీఎం సొరేన్ ఢిల్లీకి వెళ్లారని, ఆయన వెనక్కి వస్తారని చెప్పారు. ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఝార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ మాట్లాడుతూ... సొరేన్ ఎక్కడున్నారనే విషయంపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం మిస్సింగ్ అంటూ పుకార్లను పుట్టిస్తున్నారని అన్నారు.

మరోవైపు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలంతా ఈరోజు రాంచీకి చేరుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. సొరేన్ భార్య కల్పనను సీఎంగా ప్రతిపాదించే దిశగా పార్టీ హైకమాండ్ ముందుకు సాగుతోంది. మరోవైపు రాంచీ నుంచి సొరేన్ ఢిల్లీకి వెళ్లిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే ఉంది. ఢిల్లీలో ఆయన వినియోగించే రెండు బీఎండబ్ల్యూ కార్లను ఈడీ సీజ్ చేసింది. ఆయన డ్రైవర్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈడీ అధికారులు నిన్న ఢిల్లీలోని సొరేన్ నివాసంతో పాటు ఝార్ఖండ్ భవన్ కు వెళ్లి సోదాలు నిర్వహించారు. అయినప్పటికీ సొరేన్ జాడను కనిపెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో, సొరేన్ ఆచూకీపై ఉత్కంఠ నెలకొంది.

Hemant Soren
JMM
Missing
Jharkhand
BJP
Money Laundering Case
  • Loading...

More Telugu News