Niharika Konidela: నిహారిక వ్యాఖ్యల వీడియోపై జొన్నలగడ్డ చైతన్య స్పందన

Jonnalagadda Chaitanya reacts to Niharika interview video

  • 2020లో పెళ్లి చేసుకున్న కొణిదెల నిహారిక, జొన్నలగడ్డ చైతన్య
  • కొంతకాలానికే తీవ్ర విభేదాలు
  • విడాకులు తీసుకున్నామని గతేడాది ప్రకటన
  • ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు నిహారిక ఇంటర్వ్యూ
  • వీడియో లింకును సోషల్ మీడియాలో పోస్టు చేసిన యాంకర్

మెగా బ్రదర్ నాగేంద్రబాబు కుమార్తె నిహారిక విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఏపీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం 2020 డిసెంబరులో జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇరువురు కొన్నాళ్లకే విడిపోయారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని గతేడాది ప్రకటించారు. 

కాగా, ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక తన వైవాహిక జీవితంపై స్పందించారు. విడాకులకు ముందు, ఆ తర్వాత క్లిష్ట సమయాలను ఎదుర్కొన్నానని, వేదన భరించలేక ఎన్నోసార్లు ఏడ్చానని నిహారిక వెల్లడించారు. 

సదరు యూట్యూబ్ చానల్ యాంకర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య యూట్యూబ్ చానల్ యాంకర్ ను ఉద్దేశించి స్పందించారు. ఆ యాంకర్ పెట్టిన పోస్టులో కామెంట్స్ సెక్షన్ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

"ఏదైనా ఒక అంశంలో రెండు వైపులా వాదనలు వినాలి. ఏకపక్షంగా ఆలోచించి అభిప్రాయాలను వెలిబుచ్చడం సరికాదు. అందుకోసం సోషల్  మీడియాను ఉపయోగించుకోవడం మానుకోవాలి. పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయొద్దు. 

విడాకుల వంటి అంశాల్లో ఇద్దరికీ బాధ ఉంటుంది. ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయంలో ఒకరి వైపు నుంచే ఆలోచిస్తే ఎలా? అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఒకరి కోణంలోనే ఎలా నిర్ణయం వెలిబుచ్చుతారు? పైగా మీకు మీరే ప్రజలకు ఎలా చెబుతారు? ఇలాంటి విషయాల్లో అన్ని వైపుల  వారితో మాట్లాడి, వారి అభిప్రాయాలను ప్రజలకు వెల్లడిస్తే బాగుంటుందని భావిస్తున్నా. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను" అంటూ జొన్నలగడ్డ చైతన్య తన కామెంట్ లో పేర్కొన్నారు.

More Telugu News