TDP: టీడీపీని వీడి వైసీపీ పంచన చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు

Assembly secretary issues notice to four MLAs

  • గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి, కరణం బలరాం
  • కాలక్రమంలో వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యేలు
  • అనర్హులుగా ప్రకటించాలంటూ పిటిషన్ వేసిన టీడీపీ విప్ బాలవీరాంజనేయస్వామి

గత ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ టీడీపీకి దూరం జరిగి, వైసీపీ పంచన చేరారు. కాలక్రమంలో వారు వైసీపీ ఎమ్మెల్యేలుగానే చెలామణీ అవుతున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ టీడీపీ విప్ డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఆ నలుగురిని అనర్హులుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ పిటిషన్ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయం కోరారు. పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చామని, నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన సమాధానం పంపారు. 

ఈ క్రమంలో, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ లకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి నేడు నోటీసులు పంపారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం విచారణకు హాజరవ్వాలని, వారి వివరణ అందజేయాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

More Telugu News