Horse Buggy: రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రయాణించిన గుర్రపు బగ్గీ వెనుక ఆసక్తికర కథ!

A historic tale behind Horse Buggy used by President Murmu to take along France President Macron

  • నేడు అత్యంత ఘనంగా భారత రిపబ్లిక్ డే వేడుకలు
  • ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్
  • ఆరు గుర్రాలు పూన్చిన వాహనంలో వచ్చిన ముర్ము, మేక్రాన్

ఇవాళ జనవరి 26న భారత రిపబ్లిక్ డే వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ ఏడాది భారత గణతంత్ర ఉత్సవాలకు విశిష్ట అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ విచ్చేశారు. కాగా, మేక్రాన్ రాష్ట్రపతి భవన్ నుంచి భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ముతో కలిసి ఓ ప్రత్యేక గుర్రపు బగ్గీలో రిపబ్లిక్ డే పరేడ్ కు వేదికగా నిలిచిన కర్తవ్య పథ్ కు తరలి వచ్చారు. 

ఆరు గుర్రాలు పూన్చిన ఈ వాహనం వెనుక ఎంతో చరిత్ర ఉంది. సాధారణంగా రిపబ్లిక్ డే పరేడ్ కు హాజరయ్యే విదేశీ అతిథులను సాయుధ లియోసిన్ వాహనంలో తీసుకువస్తారు. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత ఈ గుర్రపు బగ్గీని వినియోగించారు. 

ఇది బ్రిటీష్ వలస పాలన నాటి వాహనం. అప్పట్లో దీంట్లో వైస్రాయ్ ప్రయాణించేవారు. అతి ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాల్లోనే దీన్ని ఉపయోగించేవారు. అయితే స్వాతంత్ర్యం వచ్చాక దేశ విభజన జరగడం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ విడిపోయే సమయంలో ఈ విలాసవంతమైన గుర్రపు బగ్గీ ఎవరికి దక్కాలన్న దానిపై పేచీ వచ్చింది. 

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల అంగీకారంతో టాస్ వేశారు. భారత్ తరఫున కల్నల్ ఠాకూర్ గోవింద్ సింగ్, పాకిస్థాన్ తరఫున సైన్యాధికారి సహాబ్ జాదా యాకూబ్ ఖాన్ టాస్ లో పాల్గొన్నారు. అయితే, ఆ నాణెం భారత్ కు అనుకూలంగా పడడంతో అరుదైన వాహనం భారత్ సొంతమైంది. 

దీన్ని కొన్నాళ్లపాటు రాష్ట్రపతి వినియోగించారు. పార్లమెంటులో పదవీ ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు వెళ్లేటప్పుడు ఉపయోగించారు. రిపబ్లిక్ డే ఉత్సవాల ముగింపు కార్యక్రమం 'బీటింగ్ ద రిట్రీట్' లోనూ ఇది దేశాధ్యక్షుడి వాహనంగా వినుతికెక్కింది. 

అయితే, ఇది ఓపెన్ టాప్ వాహనం కావడంతో కాలక్రమంలో భద్రతా కారణాల రీత్యా దీన్ని పక్కనపెట్టేశారు. దీనిస్థానంలో బుల్లెట్ ప్రూఫ్ కార్లు రంగప్రవేశం చేశాయి. మళ్లీ 2014లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 'బీటింగ్ ద రిట్రీట్' కార్యక్రమానికి హాజరవుతూ దీంట్లోనే ప్రయాణించారు. 

ఈ గుర్రపు బగ్గీ బంగారు తాపడం చేసిన రిమ్ములు, ఎర్రని వెల్వెట్ వస్త్రంతో కూడిన ఇంటీరియర్స్ తో, అశోక చక్ర ముద్రతో ఎంతో ఠీవిగా ఉంటుంది.

  • Loading...

More Telugu News