Mallikarjun Kharge: అసోంలో రాహుల్ భద్రతపై అమిత్ షాకు లేఖ రాసిన ఖర్గే

Mallikarjun Kharge wrote Amit Shah on Rahul Gandhi security concerns in Assam

  • అసోంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
  • అసోం ప్రభుత్వం, రాహుల్ గాంధీ మధ్య గరంగరం
  • రాహుల్ కాన్వాయ్ లోకి చొరబడిన బీజేపీ కార్యకర్తలు
  • ఆందోళన వ్యక్తం చేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే 

అసోంలో బీజేపీ ప్రభుత్వం, రాహుల్ గాంధీ మధ్య వాడీవేడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగారు. అసోంలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. 

అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని ఖర్గే వివరించారు. ఆ మేరకు అనేక ఘటనలను తన లేఖలో ప్రస్తావించారు. 

ముఖ్యంగా, జనవరి 22న నాగావ్ జిల్లాలో రాహుల్ గాంధీ కాన్వాయ్ ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని, వారు రాహుల్ గాంధీకి అత్యంత సమీపానికి వచ్చారని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఓ జాతీయ స్థాయి నేత కాన్వాయ్ లోకి ఇతరులు చొరబడి సమీపానికి రావడం అత్యంత అభద్రతతో కూడిన పరిస్థితి అని వివరించారు. 

ఇంత జరుగుతున్నా అసోం పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారని, కొన్నిసార్లు పోలీసులే దగ్గరుండి బీజేపీ కార్యకర్తలను రాహుల్ కాన్వాయ్ లోకి పంపించారని ఖర్గే ఆరోపించారు. ఇప్పటివరకు అసోం పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. 

రాహుల్ యాత్ర ముందుకు సాగేకొద్దీ... ముప్పు అధికమవుతోందని, ఇకనైనా మీరు జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరారు. రాహుల్ యాత్రకు తగిన భద్రత కల్పించేలా అసోం ముఖ్యమంత్రి, డీజీపీలకు దిశానిర్దేశం చేయాలని ఖర్గే తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News