Revanth Reddy: రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను: రేవంత్ రెడ్డి

Revanth Reddy condemns attack on rahul gandhi

  • యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతివ్వకపోవడం శోచనీయమన్న సీఎం
  • రాహుల్ భద్రత విషయంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపణ
  • తెలంగాణ సమాజం రాహుల్ గాంధీకి అండగా ఉందన్న రేవంత్ రెడ్డి

భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అసోంలో పర్యటిస్తున్న తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసోంలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ బతద్రువ సత్ర ఆలయానికి వెళ్లాలని భావించారని... అయితే అధికారులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

"భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీపై స్థానిక బీజేపీ స్పాన్సర్డ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయం" అని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని... రాహుల్ భద్రత విషయంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవని గుర్తుంచుకోవాలన్నారు. మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ దేశ ప్రజల మద్దతు ఆయనకు ఎప్పుడూ ఉందన్నారు. తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉందని... ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా నిలవాలని, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News