Bala Rama: బాలభానుడు .. ఈ బాలరాముడు!

- అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ
- 5 అడుగుల తేజోమయ మూర్తి
- పద్మపీఠంపై స్థానక భంగిమలో దర్శనం
- కృష్ణశిలలో మలచిన యోగిరాజ్
- ఆధ్యాత్మిక చరిత్రలో ఇది ఒక అధ్యాయం
శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు ... సూర్యుడి తేజస్సును కలిగినవాడు. అలాంటి రాముడి పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆయోధ్య. 'రామాయణం' చదివిన ప్రతి ఒక్కరూ, అప్పట్లో తాము అయోధ్య వాసులమైతే బాగుండునని అనుకుంటారు. అప్పుడు తాము అక్కడ ఉంటే ఆయనను అడవులకు వెళ్లనిచ్చేవాళ్లము కాదని అనుకుంటారు. అలా రామచంద్రుడు ఆనాటి ప్రజలను మాత్రమే కాదు, ఆ తరువాత యుగాలను కూడా ప్రభావితం చేశాడు.

అయోధ్యలోని రామాలయాన్ని ఇంతవరకూ ఎక్కడా చూడని ఒక కొత్త నిర్మాణ శైలిలో నిర్మించారు. ప్రశాంతతకు ... పవిత్రతకు .. శిల్ప నైపుణ్యానికి ప్రతీకగా ఈ ఆలయం కనిపిస్తోంది. గర్భాలయంలో 5 అడుగుల ఎత్తు కలిగిన 'కృష్ణశిల'తో మలిచిన బాలరాముడి మూర్తిని ప్రతిష్ఠించారు. పద్మపీఠంపై నిలిచిన బాలరాముడి తేజస్సు ... బాలభానుడితో పోటీపడుతోంది. ఒక చేతిలో ధనుస్సు - మరో చేతిలో విల్లు .. నుదుటున 'సూర్య తిలకం .. ధరించి చిరుమందహాసం చేస్తున్న బాలరాముడి మూర్తిని చూస్తే కనురెప్పలు కొట్టుకోవడం మానేస్తాయి .. మనసులన్నీ అనుభూతుల అక్షయ పాత్రలవుతాయి.

మైసూర్ లోని 'హెగ్గే దేవన్ కోట్'లో లభించిన కృష్ణశిలలో 'యోగిరాజ్' అనే శిల్పకారుడు బాలరాముడి మూర్తిని తీర్చిదిద్దాడు. భారతీయులంతా ఇప్పుడు ఆయనను ప్రశంసిస్తున్నారు. ఆయన మలచిన మూర్తిని మనో వేదికపై నిలుపుకుంటున్నారు. చూపులతోనే స్వామివారి సన్నిధిలో దీపాలు పెడుతున్నారు. ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వమంతటా విస్తరింపజేసేవాడు ఈ అందాల రాముడు .. తలచుకున్నవారినెల్ల తరింపజేసేవాడు ఈ అయోధ్య రాముడు.
