Sana Javed: సానియా మీర్జాతో షోయబ్ తెగదెంపులు.. మళ్లీ హైదరాబాద్ మూలాలున్న అమ్మాయితోనే పెళ్లి.. ఎవరీ సనా జావెద్?

Who Is Sana Javed What Is her Relation With Hyderabad

  • పలు సీరియళ్లు, సినిమాల్లో నటించిన సనా జావెద్
  • పలు షోలలో కలిసి కనిపించిన సనా, మాలిక్
  • ఆమె బర్త్ డే సందర్భంగా ఫొటో షేర్ చేసి విషెస్ చెప్పడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు
  • ఇప్పుడు పెళ్లితో ఒక్కటైన జంట

పాకిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్‌ను షోయబ్ మాలిక్‌ ఆ దేశ నటి సనా జావెద్‌ను వివాహం చేసుకున్నాడన్న వార్త నిన్న ఒక్కసారిగా వైరల్ అయింది. ఇటు క్రికెట్, అటు టెన్నిస్ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ వివాహ బంధం ముగిసిపోనుందని, వారిద్దరూ విడాకుల ఆలోచనల్లో ఉన్నారని గత కొన్ని నెలలుగా వార్తలు షికారు చేస్తున్నాయి. సనా జావెద్‌ను వివాహం చేసుకోవడం ద్వారా షోయబ్ ఆ వార్తలను నిజం చేశాడు. సనా జావెద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడన్న వార్త వైరల్ కావడంతో ఇంతకీ ఆమె ఎవరన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. దీంతో ఆమె కోసం గూగుల్‌లో వెతుకులాట మొదలైంది.

6 జూన్ 1993లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించిన సనా జావెద్ ఉర్దూ టెలివిజన్ చానల్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుని తర్వాత నటిగా మారింది. ఆమె పూర్వీకులు మన హైదరాబాద్ వారే. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. 2012లో ‘షెహర్-ఇ-జాత్’ అనే సీరియల్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సనా.. ఆ తర్వాత పలు సీరియళ్లలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

ఆ తర్వాత రొమాంటిక్ డ్రామా ‘ఖానీ’ అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది. అది లక్స్ స్టైల్ అవార్డ్స్‌కు నామినేట్ అయింది. ఆ తర్వాత ఆమె నటించిన ‘రుస్వాయ్’, ‘డంక్’ సీరియళ్లు కూడా ఆమెకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. రుస్వాయ్‌లో నటనకు గాను ఆమె ఉ్త్తమ నటిగా పిసా అవార్డు అందుకుంది.  2017లో ‘మెహరున్నీసా వియ్ లబ్ యు’ అనే కామెడీ సినిమాలో నటించింది.

సనా జావెద్ తాజాగా మోడలింగ్ రంగలోనూ అడుగుపెట్టింది. గత రెండేళ్లుగా ఆమె ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతోంది. ఇటీవల ఆమె కొత్త పాత్రలోనూ రాణించింది. 2020లో టెలివిజన్ రియాలిటీ గేమ్ షో ‘జీతో పాకిస్థాన్ లీగ్‌’లో ఇస్లామాబాద్ డ్రాగన్స్‌కు కెప్టెన్‌‌గానూ వ్యవహరించింది. 

అక్టోబరు 2020లో సినీ గాయకుడు, గేయ రచయిత ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకుంది. అయితే, గతేడాది చివర్లో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమెకు షోయబ్ మాలిక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ పలు షోలలో కలిసి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరిగింది. గతేడాది సనా బర్త్ డే సందర్భంగా ఆమె ఫొటోను షేర్ చేసిన షోయబ్ ‘హ్యాపీ బర్త్ డే బడ్డీ’ అని పోస్టు పెట్టడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

More Telugu News