Chandrababu: సరికొత్త కాన్సెప్ట్ 'పూర్ టు రిచ్'ను నిమ్మకూరులో ఆవిష్కరించిన చంద్రబాబు

Chandrababu inaugurates rich to poor concept in nimmakur

  • టీడీపీ మినీ మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్
  • పైలట్ ప్రాజెక్టు కింద నిమ్మకూరు, నారావారిపల్లె గ్రామాల ఎంపిక
  • సంపదను సృష్టించి పేదలకు పంచడమే పూర్ టు రిచ్ కాన్సెప్ట్ అని వెల్లడి

సంపదను సృష్టించి దానిని పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు 'పూర్ టు రిచ్' ముఖ్య ఉద్దేశ్యమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో టీడీపీ తన మినీ మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ కాన్సెప్ట్‌ను ప్రారంభించింది. చంద్రబాబు గురువారం ఈ కాన్సెప్ట్‌ను నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ఆవిష్కరించారు. దివంగత ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో నేడు చంద్రబాబు దంపతులు పర్యటించారు. గ్రామంలోని ఎన్టీఆర్, బసవతాకరం విగ్రహాలకు వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పూర్ టు రిచ్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించి... లక్ష్యాలను వివరించారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టు కింద ఎన్టీఆర్ గ్రామమైన నిమ్మకూరు, తన గ్రామమైన నారావారిపల్లె గ్రామాల్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు.

సంపదను సృష్టించి పేదలకు లబ్ధి చేకూరేలా చేయడమే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నిమ్మకూరులో 1800 ఎకరాల భూమి ఉండగా కేవలం 80 మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారన్నారు. గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదిగినవారు ఇక్కడి కుటుంబాలను బాగు చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని... ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను అన్వేషించాలన్నారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పూర్ టు రిచ్ కార్యక్రమాన్ని నిమ్మకూరులో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మన గ్రామాన్ని ప్రపంచానికి అనుసంధానం చేసే వినూత్న కార్యక్రమమన్నారు. ఈ కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఓ విజన్‌ను తయారు చేసుకోవాలని సూచించారు. ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందో ప్రణాళిక ఉండాలన్నారు. పూర్ టు రిచ్ విజయవంతమైందా లేదా తెలియాలంటే ఈ సంవత్సరం ఈ ఊరిలో తలసరి ఆదాయం ఎంత ఉంది? వచ్చే ఏడాది ఎంత ఉంది? అనేదానిని కొలమానంగా తీసుకోవాలన్నారు. ఈ కాన్సెప్ట్ విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News