Rinku Singh: రింకుసింగ్ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన రోహిత్‌శర్మ
- ఆఫ్ఘనిస్థాన్‌పై రింకుతో కలిసి భారీ స్కోరు చేసిన రోహిత్‌శర్మ
- రింకు లాంటి ఆటగాడు జట్టుకు అవసరమని వ్యాఖ్య
- ఒకే మ్యాచ్‌లో మూడుసార్లు బ్యాటింగ్ చేయడం గమ్మత్తుగా ఉందన్న కెప్టెన్
టీమిండియా యువ బ్యాటర్ రింకుసింగ్ గురించి కెప్టెన్ రోహిత్‌శర్మ బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఇలాంటి ఆటగాళ్లు జట్టుకు చాలా అవసరం అంటూ టీ20 ప్రపంచకప్ జట్టులో అతడి స్థానాన్ని దాదాపు ఖరారు చేసేశాడు. రోహిత్ వ్యాఖ్యలతో రింకు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్ గెలుపు తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. ఒకేమ్యాచ్‌లో మూడుసార్లు బ్యాటింగ్ గమ్మత్తుగా ఉందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఒకసారి ఆడినట్టు గుర్తు కానీ గతంలో ఎప్పుడు ఇలా ఆడానన్న విషయం గుర్తులేదన్నాడు. వరుసగా వికెట్లు కోల్పోతున్న వేళ చక్కని భాగస్వామ్యాలు ఎంత అవసరమో ఈ మ్యాచ్ చెప్పిందన్నాడు. రింకుతో కలిసి 190 పరుగులు జోడించడం అనేది ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉండిపోతుందని రోహిత్ వివరించాడు.
ఒత్తిడి తీవ్రంగా ఉన్నవేళ షాట్ల ఎంపిక గురించి మాట్లాడుకుంటూ నియంత్రణ కోల్పోకుండా ఆడినట్టు పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తర్వాత రింకుసింగ్ తన ఆటతీరుతో టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాడని ప్రశంసించాడు. అతడి బలాబలాలు ఏంటో అతడికి తెలుసని, ఐపీఎల్ నాటి ప్రదర్శనను కొనసాగిస్తున్నాడని కొనియాడాడు. జట్టు అవసరాన్ని బట్టి ఆడతాడని, జట్టుకు ఇలాంటి ఆటగాళ్ల అవసరం ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో రింకుసింగ్ 39 బంతుల్లో 69 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
కాగా, రింకుసింగ్ లాంటి ఆటగాళ్లు జట్టుకు ఎంతో అవసరమంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో అతడి స్థానం పక్కా అయినట్టేనని క్రీడాపండితులు చెబుతున్నారు.