Dasoju Sravan: తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క ఆంధ్రా నాయకుడి విగ్రహం ధ్వంసం కాలేదు.. కానీ ఇప్పుడే ఇలా..!: దాసోజు శ్రవణ్
- తెలంగాణ ఏర్పాటుకు జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని ఆగ్రహం
- ఇప్పుడే ఇలా విగ్రహాలపై దాడి ఎందుకు జరుగుతోంది? అని ప్రశ్న
- ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు? అని చురక
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఆంధ్ర నాయకుడి విగ్రహం కూడా ధ్వంసం చేయలేదని.. తొలగించలేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. శేరిలింగంపల్లిలో జయశంకర్ విగ్రహాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమన్నారు. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క ఆంధ్ర నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేయలేదని.. తొలగించలేదన్నారు. బీఆర్‌ఎస్ గానీ.. కేసీఆర్ ప్రభుత్వం గానీ అలాంటి చర్యలకు పాల్పడలేదని తెలిపారు. కానీ ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అని ప్రశ్నించారు. ఇదేనా కొత్త ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు? అని చురక అంటించారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. విగ్రహం ధ్వంసం చేసిన చోట మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కార్యాలయం, రాష్ట్ర డీజీపీ, సైబరాబాద్ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్లను కోరారు.