Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ధోనీ, కోహ్లీలకు ఆహ్వానం
- అయోధ్యలో ప్రతిష్ఠాత్మక రీతిలో రామ మందిర నిర్మాణం
- జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
- 6 వేల మందికి పైగా ఆహ్వానాలు
- అయోధ్యలో భారీ ఎత్తున ఏర్పాట్లు
అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. దాదాపు ఆరువేల మంది పైగా ప్రత్యేక అతిథుల సమక్షంలో ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.
తాజాగా, అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన మహోత్సవానికి టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను కూడా ఆహ్వానించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ధోనీ, కోహ్లీలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శాస్త్రోక్తంగా అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అయోధ్యలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు దేశీ నెయ్యితో తయారైన లడ్డూ, సరయూ నది నీటితో ఉన్న భరిణె, అయోధ్య రామ జన్మభూమి పునాదుల నుంచి తవ్వితీసిన మట్టిని రెండు చిన్న బాక్స్ లలో ఉంచి కానుకగా అందించనున్నారు.