Easemytrip: మాల్దీవుల విషయంలో మనసు మార్చుకోబోం.. స్పష్టం చేసిన ‘ఈజ్‌మైట్రిప్‘
- విమర్శలపై స్పందించిన ఈజ్‌మైట్రిప్ సీఈవో నిషాంత్ పిట్టి
- 95 శాతం మంది భారతీయులు తమకు అండగా ఉన్నారన్న సీఈవో
- చైనాతో కలిసి ‘ఇండియా అవుట్’ క్యాంపెయిన్‌ను మాల్దీవులు నెత్తికెత్తుకొందని ఆరోపణ
- గతవారం తమ యాప్ డౌన్‌లోడ్స్ 280 శాతం పెరిగాయన్న నిషాంత్
మాల్దీవుల విషయంలో మనసు మార్చుకునే ప్రసక్తే లేదని ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ ‘ఈజ్‌మైట్రిప్’ స్పష్టం చేసింది. భారత గౌరవానికి కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పింది. మాల్దీవులకు టికెట్లు పునరుద్ధరించే పనిచేయబోమని పునరుద్ఘాటించింది. దేశానికి మద్దతుగా నిలుస్తామని పేర్కొంది. మాల్దీవులకు టికెట్లు రద్దు చేయడంతో వెల్లువెత్తిన విమర్శలపై ఆ సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు నిషాంత్‌పిట్టి ఎక్స్ ద్వారా స్పందిస్తూ తమ నిర్ణయాన్ని సమర్థించుకొన్నారు.
ఎక్స్‌లో సుదీర్ఘంగా చేసిన పోస్టులో ఆయన మాల్దీవులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు అనుకూలంగా నడుచుకుంటూ.. రెండు దేశాలు కలిసి ‘ఇండియా అవుట్’ క్యాంపెయిన్‌ను నెత్తికెత్తుకున్నాయని ఆరోపించారు. ఇండియా కంటే చైనా టూరిస్టులే తమ దేశానికి ఎక్కువగా వస్తారని, వారి నుంచే ఎక్కువ సొమ్ము తమకు వస్తుందోన్న భావన అందులో కనబడుతోందన్నారు.
మాల్దీవులకు టికెట్లు రద్దు చేయడం ‘రిస్కీ డెసిషన్’ అయినప్పటికీ దానికే తాము కట్టుబడి ఉన్నామని నిషాంత్ తెలిపారు. 95 శాతం మంది భారతీయులు తమకు మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మిగతా 5 శాతం మంది మాత్రం దీనిని రాజకీయంగా చూస్తున్నట్టు చెప్పారు. గతవారం తమ యాప్ డౌన్‌లోడ్స్ 280 శాతం పెరిగినట్టు తెలిపారు.