Revanth Reddy: జ్యూరిచ్‌లో దిగిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు... ఫొటో ఇదిగో!

Revanth Reddy reaches Zurich airport

  • దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ చేరుకున్న సీఎం
  • ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు
  • 15 నుంచి 18 వరకు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు

దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ నుంచి స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిద్దరికి స్విట్జర్లాండ్‌లోని పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి.. శాలువా కప్పి సన్మానించారు. 

నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మణిపూర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. అర్ధరాత్రి రెండు గంటలకు స్విస్ ఎయిర్ లైన్స్‌లో స్విట్జర్లాండ్‌కు బయలుదేరారు.

రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందన్న శ్రీధర్ బాబు

తొలిసారి దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక గౌరవం దక్కిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో ఆయన మాట్లాడుతారని తెలిపారు. చర్చాగోష్ఠిలో వైద్యరంగంపై తన అభిప్రాయాలను రేవంత్ రెడ్డి పంచుకుంటారన్నారు.

ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై జరిగే అత్యున్నతస్థాయి సదస్సులో పాల్గొని అగ్రి-ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిని పరిరక్షించేందుకు వాతావరణానికి అనుగుణంగా సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించే అంశంపై రేవంత్ ప్రసంగిస్తారన్నారు. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ వర్గాలు ఏర్పాటు చేసిన 'డెవలపింగ్ స్కిల్ ఫర్ ఏఐ'లో ప్రసంగిస్తారని తెలిపారు. టెక్ కంపెనీలతో పాటు ప్రవాస భారత పారిశ్రామికవేత్తలను సీఎం కలుస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News