Yuvraj Singh: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో పాండ్యా vs రోహిత్ మధ్య ఈగో సమస్య వస్తే?.. యువరాజ్ సింగ్ చెప్పిన పరిష్కారం ఇదే!
- కలిసి ఆడేటప్పుడు ఆటగాళ్ల మధ్య ఇలాంటివి సాధారణమేనని యూవీ వ్యాఖ్య
- కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని సూచన
- పాండ్యా ముంబైకి ఆడినప్పుడు అతడి నుంచి రోహిత్ చక్కటి ప్రదర్శన రాబట్టాడని ప్రస్తావన
ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు స్టార్ ఆల్-రౌండర్ నాయకత్వం వహించబోతున్నాడు. ముంబైని ఏకంగా 5 సార్లు ట్రోఫీ గెలిపించిన సారధి రోహిత్ శర్మను పక్కనపెట్టి మరీ కెప్టెన్‌గా పాండ్యాకు యాజమాన్యం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన కూడా వెలువడింది. అనూహ్యమైన ఈ నిర్ణయంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా మధ్య ఈగో సమస్య తలెత్తి వివాదానికి దారితీయొచ్చనే టాక్ కూడా వినిపించింది. ఒకవేళ నిజంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే విషయంపై టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ ఓ సలహా ఇచ్చాడు.
ఆటగాళ్లు కలిసి ఆడుతున్నప్పుడు ఇలాంటివి జరగడం సహజమేనని యువరాజ్ సింగ్ అన్నాడు. ఏదైనా సమస్య ఉంటే ఆటగాళ్లు కూర్కొని మాట్లాడుకోవాలని సూచించాడు. హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు ఆడినప్పుడు అతడి నుంచి రోహిత్ శర్మ అత్యుత్తమ ప్రదర్శనను రాబట్టాడని, ముఖ్యంగా పాండ్యా బౌలింగ్‌ను ఉపయోగించుకొని తనపై భారాన్ని తగ్గించుకున్నాడని యూవీ ప్రస్తావించాడు. పాండ్యా డెత్ ఓవర్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని, గుజరాత్ టైటాన్స్‌కు నాలుగవ స్థానంలో బ్యాటింగ్ చేయడంతో ఆ స్థానానికి తగ్గట్టుగా ఆడాడని పేర్కొన్నాడు.
ఇదిలావుంచితే చీలమండ గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ 2023 నుంచి వైదొలగిన నాటి నుంచి పాండ్యా క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్నప్పటికీ విశ్రాంతి కోరుకోవడంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. కాగా పాండ్యాకు ఐపీఎల్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఐపీఎల్ 2024 వేలానికి ముందు అతడిని గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. సంచలన రీతిలో రాబోయే సీజన్‌కు కెప్టెన్ పాండ్యా అని వెల్లడించింది. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలకు దూరమయ్యాడు.
కాగా 2022, 2023 సీజన్లలో పాండ్యా గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 31 మ్యాచ్‌లు ఆడి 37.86 సగటుతో 833 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2015-2021 వరకు ముంబై ఇండియన్స్‌కు ఆడిన పాండ్యా మొత్తం 92 మ్యాచ్‌లు ఆడాడు. 153 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 27.33 సగటుతో మొత్తం 1,476 పరుగులు బాదాడు. ఇందులో నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కీలక మ్యాచ్‌లో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.