Balakot Strike: భారత్ కు వ్యతిరేకంగా మద్దతివ్వలేం.. పాక్ కు తేల్చి చెప్పిన జిన్ పింగ్

China Declined To support Pak against India

  • బాలాకోట్ స్ట్రయిక్స్ తదనంతర పరిస్థితులపై సంచలన విషయాలు వెలుగులోకి
  • భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలపై మాజీ దౌత్యవేత్త అజయ్ బిసారియా పుస్తకం
  • అప్పట్లో పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గా పనిచేసిన బిసారియా

పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్, ఆ తర్వాత చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పట్లో పాకిస్థాన్ లో భారత దౌత్యవేత్తగా పనిచేసిన అజయ్ బిసారియా ఈ వివరాలను ఓ పుస్తకంగా మలిచారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ పుస్తకంలోని వివరాలు కొన్నింటిని ఆయన మీడియాతో పంచుకున్నారు. సర్జికల్స్ స్ట్రయిక్స్ సమయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ ను భారత ప్రధాని మోదీ అంగీకరించలేదని ఇప్పటికే వెల్లడించిన బిసారియా.. తాజాగా మరో విషయాన్ని బయటపెట్టారు. భారత్ తో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చైనా సాయం అర్థించారని తెలిపారు. అయితే, భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు మద్ధతివ్వలేమని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు.

పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కిన మన ఎయిర్ ఫోర్స్ వారియర్ అభినందన్ వర్ధమాన్ ను వెనక్కి తీసుకురావడానికి విమానం పంపేందుకు భారత ప్రభుత్వం సిద్ధపడగా.. ఆ విమానాన్ని పాక్ అనుమతించలేదని అజయ్ బిసారియా చెప్పారు. దీంతో అప్పటికే నెలకొన్న ఉద్రిక్తత మరింత తీవ్రమైందని వివరించారు. ఆపై పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్ మినా జన్ జువాకు సైనిక అధికారుల నుంచి కీలక సందేశం అందిందని తెలిపారు. సరిహద్దుల్లో భారత సైన్యం తొమ్మిది క్షిపణులను పాక్ వైపు గురిపెట్టిందని, ఏ క్షణమైనా వాటిని పేల్చే అవకాశం ఉందనేదే ఈ సందేశమని బిసారియా చెప్పారు.

దీంతో జన్ జువా అప్రమత్తమయ్యారని, ఈ సందేశాన్ని అమెరికా, యూకే, ఫ్రాన్స్ రాయబారులకు చేరవేసి మీమీ దేశాలకు తెలియజేసి, భారత్ కు సర్దిచెప్పాలని ఆమె కోరారన్నారు. ఈ విషయంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంప్రదింపులు జరిపారని అజయ్ బిసారియా తెలిపారు. అయితే, ఇందులో పాక్ తరఫున నిలబడేందుకు జిన్ పింగ్ నిరాకరించారని, భారత్ అమెరికాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం గుర్తుచేస్తూ అగ్రరాజ్యంతో సంప్రదింపులు జరపాలంటూ ఇమ్రాన్ కు ఆయన సూచించారని తెలిపారు.

Balakot Strike
Pak PM
China Jinping
Imran Khan
Ajay Bisaria
  • Loading...

More Telugu News