Annapoorna: అందుకే ఇంతకాలం ఇండస్ట్రీలో కొనసాగాను: సీనియర్ నటి అన్నపూర్ణ
- అమ్మ పాత్రలలో మెప్పించిన అన్నపూర్ణ
- 70లలో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చానని వెల్లడి
- 80లలో బిజీ అయ్యానంటూ వివరణ
- అందుకే హీరోయిన్ గా చేయలేదని వ్యాఖ్య
తెలుగు తెరపై నిర్మలమ్మ తరువాత 'అమ్మ' పాత్రలలో అంతగా ఆకట్టుకున్న నటిగా అన్నపూర్ణ కనిపిస్తుంది. 'అమ్మ' పాత్రలలో కొన్ని దశాబ్దాలుగా ఆమె ప్రయాణం కొనసాగుతూ వస్తోంది. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను ప్రస్తావించారు. 'నా అసలు పేరు 'ఉమ' .. 'స్వర్గం నరకం' సినిమా సమయంలో సినారే గారు నా పేరును అన్నపూర్ణగా మార్చారు" అని అన్నారు.
"అవకాశాల కోసం నేను ఎప్పుడూ ఎవరినీ అడగలేదు. అలాగే పారితోషికం విషయంలో కూడా నేను డిమాండ్ చేసింది లేదు. అలా చూస్తుండగానే నటిగా 50 ఏళ్లను పూర్తి చేసుకున్నాను. 1972 - 73లలో నేను సినిమాలలోకి వచ్చాను .. 80లలో బిజీ అయ్యాను. మొదట్లో హీరోయిన్ గా వేషాలు వచ్చాయి గానీ, అంత బాగుండనని నాకు అనిపించడం వలన ఆ దిశగా ముందుకు వెళ్లలేదు" అన్నారు.
" ఇప్పుడంటే రోజుకి ఇంత అని పారితోషికాన్ని ఇస్తున్నారు. అప్పట్లో ప్రాజెక్టు మొత్తానికి కలిపి ఇచ్చేవారు. అలా 10వేల పైన ఇస్తే గొప్ప విషయం. ఏదైనా సరే మన దగ్గరికి పరిగెత్తుకు వస్తే దాని విలువ తెలియదు. మనం దాని దగ్గరకి నడచుకుంటూ వెళ్లినప్పుడే విలువ తెలుస్తుంది. అలా విలువలు తెలుసుకుంటూ వెళ్లడం వల్లనే ఇంతకాలం నిలబడ్డాను" అని చెప్పారు.